ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ లోక్‌సభ స్థానంలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు సమాజ్‌వాదీ పార్టీ నేతలు. సైకిల్ గుర్తుకు ఓటేస్తే వీవీప్యాట్ మాత్రం కమలం చూపించిందని ఆరోపించారు. కన్నౌజ్‌లోని రెండు పోలింగ్ కేంద్రాల్లో ఈ పరిస్థితి నెలకొందని వివరించారు ఎస్పీ నేతలు.
ఇదే సమయంలో ఎస్పీ మద్దతుదారులను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఓటు వేసి ఇంట్లో వెళ్లి కూర్చోవాలని, రహదారులపై కనిపించకూడదని బెదిరించారని తెలిపారు. కన్నౌజ్ స్థానం నుంచి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు.
డీజీపీని సస్పెండ్ చేయాలి: సమాజ్‌వాదీ
ఎన్నికల్లో పోలీసు యంత్రాంగాన్ని అధికార భాజపా దుర్వినియోగం చేస్తోందని ఎస్పీ నేత ధర్మేంద్రయాదవ్ ఆరోపించారు. యూపీ డీజీపీ ఓపీ సింగ్ భాజపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. కన్నౌజ్‌లోని 197వ పోలింగ్ కేంద్రంలోని ఎస్పీ ఏజెంట్‌ను స్థానిక భాజపా ఎమ్మెల్యే ఆదేశాలతో బయటికి పంపారని తెలిపారు. 92వ పోలింగ్ కేంద్రంలో ఓటర్ల వద్ద నుంచి పోలీసుల సహకారంతో స్లిప్పులు తీసుకున్న భాజపా ఏజెంట్లు.. వారే ఓట్లు వేశారని చెప్పారు.
వీటన్నింటినీ పరిగణించి ఓపీ సింగ్‌ను విధుల నుంచి తొలగించాలని ఈసీని ఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. ఈవీఎం సమస్యతో పాటు, డీజీపీ విషయమై రాష్ట్ర ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లుకు వినతి పత్రం సమర్పించారు.
ఇదీ చూడండి: మళ్లీ ఈవీఎంల సమస్యలు- బంగాల్లో గొడవలు