ఓ మహిళా మంత్రిని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడం వల్ల మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ కించపరచాలనుకోలేదని తెలిపారు. అభ్యర్థి పేరు గుర్తు రాకపోవడం వల్లే 'ఐటం' అనే పదం వాడాల్సి వచ్చిందన్నారు.
'నేను ఓ మాట అన్నాను. అది ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో వాడలేదు. నాకు ఆ వ్యక్తి పేరు గుర్తుకురాలేదు. ఈ జాబితాలో (చేతిలో ఉన్న ఓ పత్రాన్ని చూపుతూ) ఐటం నెం.1, ఐటం నెం.2 అని ఉంది. అది అవమానించినట్లా?' అంటూ తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. ప్రచారంలో చెప్పుకునేందుకు ఏమీ లేకే భాజపా ఈ అంశంపై వివాదం చేస్తోందని ఆరోపించారు.
ప్రచార పర్వంలో భాగంగా గ్వాలియర్‌లోని డబ్రా పట్టణంలో కమల్‌నాథ్ ఆదివారం ప్రసంగిస్తూ.. 'ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ రాజె నిరాడంబర వ్యక్తి. ఆయన ప్రత్యర్థి (భాజపా అభ్యర్థి) గురించి నా కంటే మీకే బాగా తెలుసు. తను ఓ ఐటం' అని వ్యాఖ్యానించారు.
దీనిపై రాజకీయ రగడ రాజుకుంది. ఆయన తరఫున కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని భాజపా డిమాండ్ చేసింది. కమల్‌నాథ్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 3వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. డబ్రాలో కమలదళం తరఫున ఇమర్తీ దేవి బరిలో ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఆమె కూడా ఒకరు. వారి ఫిరాయింపుతో రాష్ట్రంలో కమల్‌నాథ్ ప్రభుత్వం పడిపోయింది.
ఇదీ చూడండి: కమల్‌నాథ్ అనుచిత వ్యాఖ్యలపై దుమారం