భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య నేడు జరగనున్న రెండవ ఇష్టాగోష్ఠికి సర్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే బలమైన శక్తులుగా ఎదుగుతున్న రెండు దేశాల అధినేతల సమావేశానికి తమిళనాడులోని మామల్లపురం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రెండు రోజుల చైనా అధ్యక్షుడి పర్యటనలో ఎలాంటి ఒప్పందాలు జరగనప్పటికీ... ఈ చారిత్రక సమావేశంలో అనేక విషయాలపై ఇరు నేతలు చర్చించే అవకాశముంది.
జిన్పింగ్తో భేటీ కోసం ఉదయం 11:15 నిమిషాలకు చెన్నైకు చేరుకుంటారు మోదీ. అక్కడే చైనా అధ్యక్షుడికి స్వాగతం పలుకుతారు. అనంతరం చెన్నై నుంచి మామల్లపురంలోని షోర్ ఆలయానికి పయనమవుతారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను అగ్రనేతలు తిలకించనున్నారు. ఆ తర్వాత చైనా అధ్యక్షుడికి ప్రత్యేక విందును ఇవ్వనున్నారు మోదీ.
శనివారం మోదీ-జిన్పింగ్ మధ్య చెన్నైలో అనధికారిక సమావేశం జరగనుంది. అనంతరం చైనాకు తిరుగుపయనమవుతారు జిన్పింగ్.
భద్రత కట్టుదిట్టం...
మోదీ-జిన్పింగ్ సమావేశం కోసం చెన్నై, మామల్లపురం పరిసరాల్లో భద్రతను పటిష్ఠం చేశారు అధికారులు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని పనులను క్షుణ్ణంగా పర్యవేక్షించాయి. నిత్యం అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు.
ఇరు దేశాల మధ్య వాణిజ్య, సరిహద్దు వంటి అనేక అంశాల్లో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కశ్మీర్ విషయంలో చైనా వైఖరిపై భారత్ అసంతృప్తిగా ఉంది. ఈ తరుణంలో అగ్రనేతలు భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ సమావేశం ద్వారా.. సమస్యలను పక్కనపెట్టి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ముందడుగు వేయాలని ఇరు దేశాలు ఆశిస్తున్నాయి.
ఇదీ చూడండి:- చైనా అధ్యక్షుడికి చెన్నై విద్యార్థుల వినూత్న స్వాగతం