మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన అనంతరం జరిగిన ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు ఘోర పరాభవం ఎదురైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా అగ్రనేతలు ప్రచారాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఝార్ఘండ్ ఓటర్లు జాతీయ అంశాలను పట్టించుకోకపోవటం వల్ల ఓటమి తప్పలేదు.
ఊహించని విధంగా వచ్చిన ఝార్ఖండ్ తీర్పుతో.. త్వరలో జరగబోయే రాష్ట్రాల ఎన్నికల్లో ప్రాంతీయ నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, వారి ఆందోళనలు విస్మరించకూడదని ఆలోచిస్తోంది కాషాయ పార్టీ. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటిమిలో తప్పు ఎక్కడ జరిగిందనే అంతఃర్మథనంలో పడినట్లు భాజపా వర్గాలు తెలిపాయి. కొన్ని నెలల్లో దిల్లీలో ఎన్నికలు రానున్న వేళ.. స్థానిక సమస్యలైన నాయకత్వం, రాష్ట్రాల విభాగాల్లో అంతర్గత కలహాలు వంటి అంశాలపై చర్చించి అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించాలని పేర్కొంటున్నాయి.
స్థానిక నాయకత్వానికి సముచిత స్థానం..
ఝార్ఖండ్‌లో ఎదురైన అనుభవం.. స్థానిక విభాగాలకు మరింత సముచిత స్థానం కల్పించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతోంది. ముఖ్యంగా భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో పలువురు స్థానికంగా పలుకుబడి ఉన్న నేతలకు టికెట్లు నిరాకరించి సీట్లు కోల్పోయింది భాజపా.
ఝార్ఖండ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్.. భాజపా రెబల్ నేత సరయు రాయ్ చేతిలో ఘోరంగా ఓడిపోవటంపైనా ఆలోచన చేయాల్సి ఉందని... స్థానికంగా ఎంతో పలుకుబడి ఉన్న సరయు రాయ్‌ని విస్మరించటం ద్వారా కేంద్ర నాయకత్వం తప్పు చేసిందని భావిస్తోంది. అసోం, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపైనా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
పౌర చట్టం, ఎన్ఆర్సీ సంబంధిత నిరసనల నేపథ్యంలో వచ్చిన ఝార్ఖండ్ ఎన్నికల్లో ఓటమితో భాజపా వ్యూహాలపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి విపక్షాలు సఫలీకృతమైన విషయాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
రాజ్యసభ ఎన్నికల్లో విపక్షాలకు బలం..
గడిచిన ఏడాది కాలంలో నాలుగు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది భాజపా. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లో రాజ్యసభ ఎన్నికల్లో ఇది.. విపక్షాలకు మరింత బలం చేకూర్చనుంది.