కడుపునొప్పితో బాధపడుతున్న ఓ మహిళా ఉద్యోగి చికిత్స కోసం జులై 23న ఝార్ఖండ్ ఘాటిశ్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షలు చేసిన డాక్టర్ అష్రఫ్ బాదర్.. ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు. ఆ మందుల చీటీ పట్టుకొని.. మెడికల్ స్టోర్‌కు వెళ్లిందా ఉద్యోగి. ఒక్కసారిగా కంగుతిన్న అక్కడి సిబ్బంది... ప్రిస్క్రిప్షన్‌లో కండోమ్ రాశారని చల్లగా చెప్పారు.
ఆ ఉద్యోగి నివ్వెరపోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఓ మానసిక వైద్యుడు సహా మొత్తం ముగ్గురితో కూడిన ఓ వైద్యబృందాన్ని నియమించారు ఉన్నతాధికారులు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా శాసనసభ్యుడు కునాల్ సారంగి ఈ ఘటనను అసెంబ్లీలో ప్రస్తావించగా.. పెద్ద గందరగోళమే తలెత్తింది.
జులై 28న కమిటీ విచారణ ప్రారంభించింది. వైద్యుడు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఫామ్‌తో పాటు మెడికల్ రిజిస్ట్రీని ఆసుపత్రి నుంచి స్వాధీనం చేసుకున్నారు కమిటీ సభ్యులు. దర్యాప్తు వేగవంతం చేశారు.
''మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు విచారణ కోసం ఓ వైద్య బృందం ఏర్పాటైంది. త్వరలో నిజానిజాలు తేలుస్తాం.''
- డాక్టర్. ప్రభాకర్ కుమార్ భగత్, వైద్యబృంద సభ్యుడు
ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర దాగుందని ఆరోపించారు డాక్టర్ అష్రఫ్. ఇతర వైద్య సిబ్బంది నిర్వాకం అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.