వేసవి ప్రతాపం అడవిపైనా పడుతోంది. అరణ్యాల్లో ఉండాల్సిన జంతువులు జనారణ్యాంలోకి వస్తున్నాయి. పెరుగుతున్న ఎండలు చిరుతపులులపైనా ప్రభావం చూపుతున్నాయి. దారితప్పిన చిరుతలు జనావాసాల్లోకి వచ్చి హల్చల్ చేస్తున్నాయి. జనాన్ని భయభ్రాంతులను చేస్తున్నాయి. తాజాగా కర్ణాటక, హర్యానాల్లో చిరుతల సంచారం జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.
కొబ్బరి చెట్టు ఎక్కిన చిరుత
కర్ణాటకలోని మాండ్య జిల్లా కృష్ణరాజపేట తాలుకా, సోమ్నాథ్పూర్లో ఓ చిరుత కొబ్బరి చెట్టెక్కింది. యోగేశ్ అనే రైతు పొలంలో కొబ్బరి చెట్టు ఎక్కిన చిరుత దిగేందుకు నానా అవస్థలు పడుతూ స్థానికులకు కనిపించింది. వారు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు.
గ్రామస్థులంతా చిరుతను చూసేందుకు తరలివచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు గ్రామస్తుల సాయంతో చిరుతను కిందకు దించారు. దూకిన చిరుత చెరుకుతోటల్లో దూరి పారిపోయింది. కృష్ణ రాజ్ పేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ సంఘటనపై కేసు నమోదైంది. చిరుత అక్కడికెలా వచ్చిందని అధికారులు అరా తీస్తున్నారు.
అనుకోని అతిథి
హరియాణా లో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. పల్వాల్ పట్టణం రామ్నగర్ కాలనీలో ఓ ఇంట్లోకి చిరుతపులి రూపంలో అనుకోని అతిథి వచ్చింది. చూసిన ఇంట్లోని కుటుంబసభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
చివరకు సురక్షితంగా పులిని బంధించిన అధికారులు దాన్ని 60 కిలోల బరువున్న మగపులిగా గుర్తించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించిన పులి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అక్కడే ఉంది.