కేంద్రప్రభుత్వం ముందు నుంచి ఊహించినట్టుగానే కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసింది. కశ్మీర్‌వ్యాప్తంగా ముందు జాగ్రత్తల్లో భాగంగా ప్రత్యేక బలగాలను కేంద్రం మోహరించింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఒక దేశం, ఒకే రాజ్యాంగం అనే నినాదాన్ని వినిపించిన భాజపా నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ఈ మేరకు తదుపరి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అసలు ఆర్టికల్ 370 కశ్మీర్‌కు కల్పిస్తున్న ప్రత్యేక హక్కులు ఏమిటి? అది రద్దు చేస్తే కశ్మీరీలు కోల్పోయే హక్కులు ఏమిటనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
ఇదీ చరిత్ర
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేరుస్తూ సవరణలు చేశారు. 1957 జనవరి 26 నుంచి కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగం అమల్లోకి రావడానికి ముందు సుదీర్ఘ ప్రక్రియ సాగింది. దాదాపు పదేళ్లు సాగిన ఈ ప్రక్రియలో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1947లో భారత్-పాకిస్థాన్ విభజన జరిగినప్పుడు, అప్పటి జమ్ముకశ్మీర్ రాజు హరిసింగ్ స్వతంత్రంగా ఉండాలని భావించారు. అయితే పాకిస్థాన్ సైన్యం కశ్మీర్‌లోకి చొచ్చుకురావడంతో హరిసింగ్ భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఈ పరిస్థితుల్లోనే కొన్ని షరతులతో కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు హరిసింగ్ తన అంగీకారాన్ని తెలిపారు. అలా 1947 అక్టోబరు 26న కశ్మీర్ భారత యూనియన్‌లో విలీనమైంది.
అయితే ఈ విలీనం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు అనే అంశాలకే పరిమితమైంది. అప్పటికి విలీనం తుది విధి విధానాలు ఖరారు కాకపోవడంతో 1949 జులైలో నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత షేక్ అబ్దుల్లా, అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో కశ్మీర్‌కు ఉండాల్సిన హక్కులపై ముమ్మర చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా 1951లో రాష్ట్రాన్ని, రాజ్యాంగ అసెంబ్లీని ప్రత్యేకంగా పిలవడానికి అనుమతి లభించింది. ఈ మేరకు జమ్ము కశ్మీర్ కోసం రక్షణ, విదేశాంగ, కమ్యూనికేషన్ అంశాల్లో పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కు కల్పిస్తూనే రాష్ట్రం కోసం ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 1956 నవంబర్‌లో జమ్ముకశ్మీర్ రాజ్యాంగం ప్రక్రియ పూర్తి చేశారు. చివరకు కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేర్చారు. 1957 జనవరి 26 నుంచి ప్రత్యేక రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
ప్రత్యేక హక్కులు
సుదీర్ఘ ప్రక్రియ తర్వాత అమల్లోకి వచ్చిన ఆర్టికల్ 370లోని నిబంధనల ప్రకారం రక్షణ, విదేశాంగ విధానాలు, కమ్యూనికేషన్ అంశాలు మాత్రమే భారత ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ఇతర ఏ అంశానికి సంబంధించిన చట్టాన్ని రూపొందించాలన్నా, అమలు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం. జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక ప్రతిపత్తి వల్ల భారత రాష్ట్రపతికి ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు ఉండదు. పౌరసత్వం, ఆస్తిహక్కు, ప్రాథమిక హక్కుల విషయంలో ప్రజలకు ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. అందుకే జమ్ము కశ్మీర్‌లో ఇతర రాష్ట్రాల వారు భూ క్రయవిక్రయాలు జరపలేరు. ఆర్టికల్ 370 వల్ల జమ్ముకశ్మీర్‌లో అశాంతి, హింస లాంటివి జరిగినప్పుడు రాష్ట్రపతి స్వయంగా అక్కడ అత్యవసర స్థితి విధించలేరు. ఇతర దేశాలతో యుద్ధం వచ్చిన పరిస్థితుల్లో మాత్రమే ఈ రాష్ట్రంలో అత్యవసర స్థితిని అమలు చేయడానికి వీలుంటుంది.
ఇలా రద్దు అయ్యింది
కొన్నాళ్ల క్రితం జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370కి సంబంధించి జమ్ము-కశ్మీర్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 2015లో దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జమ్ము-కశ్మీర్ హైకోర్టు రాజ్యాంగంలోని పార్ట్ 21లో ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధన అనే శీర్షికలో చెబుతున్నప్పటికీ ఆర్టికల్ 370 ఒక శాశ్వత నిబంధన అని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 370 మూడో విభాగం ప్రకారం దానిని ఉపసంహరించడం గానీ, సవరించడం గానీ కుదరదని హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు ఆర్టికల్ 370ని తొలగించాలంటూ సుప్రీంకోర్టులో 2015 డిసెంబర్‌లో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ తర్వాత ఆర్టికల్ 370ని రాజ్యాంగం నుంచి తొలగించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు భారత రాజ్యాంగం నుంచి ఆర్టికల్ 370ని తొలగిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులతో కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు కాగా ఇకపై కశ్మీర్ ప్రజలకు కూడా ప్రత్యేక హక్కులు ఏవీ వర్తించవు. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ నిబంధనలే వర్తిస్తాయి.
ఇదీ చూడండి: 'చారిత్రక నిర్ణయంతో 70ఏళ్ల కల సాకారం'