కశ్మీర్లో మరోసారి భారీ స్థాయిలో ఆయుధాలు దొరికాయి. వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు అత్యాధునిక తుపాకులను తరలిస్తుండగా.. కుల్గాంలోని కాజీగుండ్ వద్ద ఆర్మీ, సీఆర్పీఎఫ్ బలగాలు పట్టుకున్నాయి. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సహా భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు.
జమ్ముకశ్మీర్లో కొద్దికాలంగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. 24 గంటల వ్యవధిలో ఇద్దరిని కాల్చిచంపారు. బుధవారం రాత్రి బుడ్గాంలోని ఖాగ్ బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ సభ్యుడిని, గురువారం సాయంత్రం న్యాయవాది బాబర్ ఖాద్రీని పొట్టనబెట్టుకున్నారు.
మరోవైపు.. పాక్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ రాజౌరీ వద్ద నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్ షెల్లింగ్లకు పాల్పడగా.. భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. ఈ నెలలోనే పాక్.. 38 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘించింది.