విదేశాంగ మంత్రి జయ్శంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభ స్థానంలో పోటీచేయడానికి సిద్ధపడుతున్నారు. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జే.పి నడ్డా సమక్షంలో పార్టీలో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే జయ్‌శంకర్‌ను గుజరాత్ రాజ్యసభ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది.
కేంద్రంలో రెండోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం మే 30న జయ్‌శంకర్‌కు విదేశాంగశాఖ బాధ్యతలు అప్పగించారు. ఆరు నెలల్లోగా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవ్వాలి.
భాజపా అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ నాయకురాలు స్మృతి ఇరానీ లోక్‌సభకు ఎన్నికైన నేపథ్యంలో తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేశారు. ఆ రెండు స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. ఒకదాంట్లో జయ్శంకర్ పోటీచేస్తుండగా... మరో స్థానానికి మాథుర్జీ ఠాకుర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది భాజపా.