ఇరాన్ అత్యున్నత సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ హత్య తర్వాత అమెరికా- ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న పరిణామాలపై భారత్ తీవ్ర అందోళన చెందుతోందని విదేశాంగ మంత్రి జయ్శంకర్ అన్నారు.
"ఇరాన్ విదేశాంగ మంత్రి జరీఫ్‌తో చర్చలు ముగిశాయి. సులేమానీ మృతి తర్వాత పరిణామాలు ఉద్రిక్తంగా మారాయి. భారత్ ఈ ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన చెందుతోంది. పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాం."
-జయ్శంకర్, విదేశాంగ మంత్రి.
ఆ 52 ప్రాంతాలే మా లక్ష్యం...
పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు అలుముకున్న వేళ.. ఇరాన్‌ను మరోమారు తీవ్రంగా హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికన్లపైనా, అమెరికా ఆస్తులపైనా దాడి చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే.. సహించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్‌కు సంబంధించిన 52 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నామని.. వాటిపై ఎంతో వేగంగా, ఎంతో బలంగా దాడి చేయడానికి సిద్ధమని ట్రంప్ తెలిపారు.