గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఆసుపత్రిలో గతేడాది డిసెంబరులో 111 మంది శిశువులు మరణించారని అధికారులు తెలిపారు. నవంబరులో వీరి సంఖ్య 81, అక్టోబరులో 87గా ఉన్నట్లు పేర్కొన్నారు.
డిసెంబరులో ప్రధానంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో రోగులు ఆసుపత్రులకు రావడం వల్ల శిశు మరణాల సంఖ్య అధికమైందని ఆసుపత్రి సూపరింటెండెంట్ మనీశ్ మెహతా తెలిపారు. అంతే కాకుండా తక్కువ బరువుతో పుట్టడమూ చిన్నారుల మరణాలకు ఓ కారణమన్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలను అంచనా వేసి నెలకోసారి సమావేశాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఆసుపత్రిలో అత్యవసర పరికరాలను అందుబాటులో ఉంచేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మరో వైపు రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి చెందిన ప్రభుత్వాసుపత్రిలో డిసెంబరు నెలలో 85 శిశు మరణాలు సంభవించాయి. నెలలు నిండకముందే శిశువు జన్మించడం, తక్కువ బరువును కలిగి ఉండటం, సరిగా ఉపిరి ఆడకపోవడం వంటి సమస్యలే మరణాలకు ప్రధాన కారణాలుగా అధికారులు తెలిపారు. గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రతి 1000 మందికి 30 మంది శిశువులు మరణిస్తున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నితిన్ పటేల్ వివరించారు.
రాజస్థాన్‌లోనూ ఇదే పరిస్థితి
గత ఏడాది డిసెంబర్‌లో జోధ్‌పుర్‌లోని రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 100 మందికి పైగా శిశు మరణాలు సంభవించాయి. ఉమైద్, ఎండీఎం ఆసుపత్రుల్లో 146 మంది పిల్లలు మరణించగా... నియో నాటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో 102 మరణాలు సంభవించాయి. కోటా ప్రభుత్వ ఆసుపత్రిలో 107 మంది పిల్లలు మృతి చెందారు. 2019లో మొత్తం 47,815 మంది పిల్లలు ఆసుపత్రుల్లో చేరగా.. వారిలో 754 మంది పిల్లలు మరణించినట్లు ఎస్ఎస్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ రాఠోడ్ తెలిపారు. ఇక డిసెంబరులో 4,689 మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరగా.. 3002 మంది ఎన్ఐసీయూ, ఐసీయూ కేర్‌లో ఉన్నారని. వారిలో 146 మంది పిల్లలు మరణించినట్లు వెల్లడించారు.
చాలా మంది సీనియర్ ప్రభుత్వ వైద్యులు.. ప్రైవేటు ఆసుత్రులను నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయని రాఠోడ్ అన్నారు. అలాంటి వైద్యులకు ఇటీవల నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం.
ఇదీ చూడండి:భద్రత లేని ఏటీఎం చోరీ.. 2 లక్షల నగదు మాయం!