విదేశాంగ కార్యదర్శిగా సేవలందించిన జై శంకర్... మోదీ మంత్రివర్గంలో కీలకమైన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. విదేశీ వ్యవహారాల నిపుణుడిగా ఆయనకు ఉన్న అనుభవం... ఆ శాఖ ముందున్న కీలక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉపకరిస్తుందన్నది భాజపా పెద్దల ఆలోచన.
చైనా, అమెరికా దౌత్య వ్యవహారాల్లో నిపుణుడైన జైశంకర్... ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడు కాదు.
ప్రథమ ప్రాధాన్యం..
జైశంకర్ ఆధ్వర్యంలోని విదేశీ వ్యవహారాలశాఖ ప్రథమ ప్రాధాన్యంగా... విదేశాలతో వాణిజ్య, రక్షణ ఒప్పందాలను బలోపేతం చేసుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఫ్రాన్స్, ఐరోపా సమాఖ్యతోపాటు భారత ఇరుగుపొరుగు దేశాలతో వాణిజ్య, రక్షణ సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సి ఉంది.
చైనాతో బంధం మెరుగుపరచడం జైశంకర్‌కు ఓ సవాల్. 2017లో డోక్లాం ఘటన తర్వాత ఇరుదేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. నాటి ప్రతిష్టంభనకు తెరదించడంలో జైశంకర్ కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో మైత్రి పునరుద్ధరణ... ఆయన నైపుణ్యానికి పరీక్ష.
ఐక్యరాజ్యసమితిలో...
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్జీ)లో శాశ్వత సభ్యత్వం సాధించడం.. ఎన్డీఏ ప్రభుత్వం ముందున్న మరో కర్తవ్యం.
ముడిచమురు సమృద్ధిగాగల గల్ఫ్, మధ్య ఆసియా దేశాలతో... భారత్ సత్సంబంధాలు వృద్ధి చేసుకోవాల్సి అవసరం ఉంది. ఈ పనులను జైశంకర్ సమర్థంగా నిర్వహిస్తారని భాజపా అధిష్ఠానం ఆశిస్తోంది.
జైశంకర్ ఘనతలు..
భారత ప్రధాన వ్యూహాత్మక విశ్లేషకుల్లో ఒకరైన జైశంకర్... 'భారత్-అమెరికా అణుఒప్పందం' సాకారం చేసిన జట్టులో కీలక సభ్యుడు. 2005 నుంచి సుదీర్ఘకాలంపాటు నానిన ఈ ఒప్పందం.. మన్మోహన్సింగ్ హయాం(2007)లో సాకారమైంది.
విశేషాలు..
1977 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన జైశంకర్ చెక్ రిపబ్లిక్, అమెరికా, చైనాల్లో భారత రాయబారిగా పనిచేశారు. సింగపూర్‌లో భారత హైకమిషనర్‌గానూ పనిచేశారు. 2015లో విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2018లో పదవీ విరమణ చేశారు. అనంతరం 'టాటా సన్స్' అంతర్జాతీయ కార్పొరేట్ వ్యవహారాల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
దేశానికి విస్తృత సేవలందించిన జైశంకర్‌ను ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది భారత ప్రభుత్వం.
ఇదీ చూడండి: ఎక్కడికైనా సైకిల్‌పై వెళ్లే కేంద్ర మంత్రి!