కరోనా వైరస్ రక్తంలోని ఆక్సిజన్ స్థాయిపైనా ప్రభావం చూపిస్తోందని అమెరికా షికాగోలోని ఇల్లినాయీ విశ్వవిద్యాలయ ఎపిడమాలజిస్ట్ విజయ్ వీ యాదవెందు తెలిపారు. అందువల్ల శరీరంలోని ఆక్సిజన్ స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం శ్రేయస్కరమని 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.
"ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. రక్తంలోని ప్రాణవాయువు స్థాయిపైనా ప్రభావం చూపుతోంది. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఆక్సిజన్ స్థాయి అకస్మాత్తుగా పడిపోతే.. ఆ వ్యక్తి కుప్పకూలే ప్రమాదం ఉంది. రక్తం గడ్డకట్టుకుపోతుంది. దీని వల్ల ఇంకా ప్రమాదముంది."
--- విజయ్ యాదవెందు, ఎపిడమాలజిస్ట్.
వైరస్ బాధితుల్లో ఆక్సిజన్ స్థాయి అనూహ్యంగా పడిపోతున్న విషయాన్ని బ్రిటన్ వైద్యులు గుర్తించారని.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణవాయువును అందించడం సహా డిక్సామెథసోన్ అనే స్టెరాయిడ్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తున్నట్టు వారు నిర్ధరించారని విజయ్ వెల్లడించారు. అయితే స్టెరాయిడ్ వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నారు.
భారత్‌తో పోల్చుకుంటే అమెరికాకు భారీ స్థాయిలో వైరస్ ప్రవేశించిందని చెప్పారు విజయ్. దాని తీవ్రతను గుర్తించే సరికే ఆలస్యమైందని, అందుకే అగ్రరాజ్యం అధికంగా నష్టపోయిందని వివరించారు. అయితే భారత్‌లో కేసులు పెరుగుతున్నప్పటికీ.. ఇతర దేశాలతో పోల్చుకుంటే వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు మెరుగ్గానే ఉన్నాయన్నారు విజయ్. అదే విధంగా.. ఇతర దేశాల ప్రజలతో భారతీయుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువని.. ఈ విషయమే వైరస్‌ను వారిని రక్షిస్తోందని చెప్పారు.
ఇదీ చూడండి:- కరోనా వేళ జిమ్‌లు ఎంత సురక్షితం?