కేంద్రం కొత్తగా మంజూరు చేసిన రెండు కమాండ్ సెంటర్లను ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ) శుక్రవారం ప్రారంభించింది. గువాహటి, ఛండీగఢ్లో ఉన్న ఈ రెండు కేంద్రాలు.. వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యాన్ని మోహరించడంపై ప్రత్యేకంగా పర్యవేక్షిస్తాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేంద్రాలను తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఐటీబీపీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఇటీవల భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలోనే ఈ కార్యాలయాలను సత్వరం ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.
ఆర్మీలో 'లెఫ్టినెంట్ జనరల్' హోదాకు సమానమైన 'అడిషనల్ డైరెక్టర్ జనరల్' స్థాయి అధికారి నేతృత్వంలోఈ కేంద్రాలు పనిచేస్తాయని ఐటీబీపీ పేర్కొంది. ఈ కమాండ్‌ల ద్వారా నిఘా, దళాల మోహరింపుతో పాటు పలు పాలనాపరమైన కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఆర్మీతో కలిసి పనిచేసే విధంగా వీటిని ఏర్పాటు చేసినట్లు వివరించింది.
ఇదీ చదవండి: జులై 3న దేశవ్యాప్త నిరసనలకు కార్మిక సంఘాల పిలుపు