‘అభిప్రాయ భేదాలు, కొద్దిపాటి ఘర్షణలు భారత్-రష్యాల చిరకాల మైత్రిని ఏనాడూ ప్రభావితం చేయలేవు’ అన్నది దాదాపు రెండు దశాబ్దాలనాడు పుతిన్ దృఢంగా పలికిన మాట. ఇరు దేశాల నడుమ పదేళ్లపాటు భాగస్వామ్యాన్ని పటిష్ఠీకరించాలన్నది అయిదు సంవత్సరాలక్రితం వెలుగుచూసిన ప్రత్యేక ‘విజన్’ అజెండా. ఆపై రక్షణ తదాది రంగాల్లో సహకారాన్ని ఇతోధికం చేయాలన్న ఆశయ ప్రకటనలు వరసగా వెలువడ్డాయి. రష్యా తూర్పుతీర నగరం వ్లాదివొస్తోక్ వేదికగా మోదీ, పుతిన్‌ల సమక్షంలో తాజాగా కుదిరిన పదిహేను ఒప్పందాలు దిల్లీ- మాస్కోల పాత చెలిమికి కొత్తచివుళ్లు తొడగాలనే స్ఫూర్తిని ప్రస్ఫుటీకరిస్తున్నాయి. మాస్కోతో బాంధవ్యాన్ని ఒక మెట్టుపైకి ఎక్కించాలన్న ఉద్దేశం- రష్యా రక్షణశాఖకు అవసరమైన విడిభాగాలను భారత్‌లో తయారు చేసి ఇచ్చేందుకు కుదిరిన అవగాహనలో స్పష్టమవుతోంది.
జల, బొగ్గు ఆధారిత, సంప్రదాయేతర మార్గాల్లో విద్యుదుత్పత్తికి సంబంధించి భాగస్వామ్య విస్తరణకు కొత్తగా ఒప్పందం ముడివడింది. 2025 సంవత్సరానికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 3000కోట్ల డాలర్ల (సుమారు రూ.2.15లక్షలకోట్ల) స్థాయికి విస్తరింపజేయడంతోపాటు పెట్రో, గ్యాస్ రంగాల్లో సహకరించుకోవాలనే ప్రణాళిక అమలుకు ఉభయ దేశాలు కట్టుబాటు చాటాయి. పారిశ్రామికంగా పరస్పరం తోడ్పాటు అందించుకోవాలని, అధునాతన సాంకేతికతల అభివృద్ధికి పెట్టుబడులు సమకూర్చాలనీ నిర్ణయించాయి. రష్యానుంచి దీర్ఘకాలం ముడిచమురు సరఫరాకు పైప్‌లైన్ నిర్మించదలచడం, ఇంధనావసరాలు ఇంతలంతలవుతున్న దశలో ఇండియా నెత్తిన పాలుపోసే పరిణామం. కోకింగ్ కోల్ సరఫరాకు మార్గం సుగమం కావడం దేశీయంగా తయారీరంగం విస్తృతికి విరివిగా దోహదపడనుందన్న విశ్లేషణలు- రష్యాతో ఒడంబడికల ప్రాముఖ్యాన్ని చాటుతున్నాయి.
దశాబ్దాల నుంచి కొనసాగుతున్న బంధం
తాత్కాలికంగా వెలుపలినుంచి ఆయుధాలను, సైనిక సామగ్రిని భారత్ సమకూర్చుకున్నా భవిష్యత్తులో సొంతంగానే రూపొందించుకోవాలన్న ప్రథమ ప్రధాని నెహ్రూ నిర్దేశం దశాబ్దాల తరబడి నిలువునా నీరోడింది. దేశ రక్షణావసరాల్లో అరవై శాతానికిపైగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడాల్సిన దుస్థితి, మునుపటి ప్రభుత్వాల్లో ముందుచూపు కొరవడ్డ పర్యవసానమేనని చెప్పాలి. చిరకాలం భారత్ అమ్ములపొదికి నాటి సోవియట్ యూనియనే పెద్ద దిక్కుగా నిలిచింది. సోవియట్ విచ్ఛిన్నానంతరం రక్షణ దిగుమతులకు కొన్నాళ్లు ప్రత్యామ్నాయాలు అన్వేషించిన ఇండియా, ఫుతిన్ శకారంభం దరిమిలా తిరిగి రష్యాపైనే ఎక్కువగా ఆధారపడింది. ‘విక్రేత-కొనుగోలుదారు’గా ఉన్న బంధం స్థానే ఆయుధాలు, విమానాల ఉమ్మడి ఉత్పత్తికి ఇరవై ఏళ్లనాడే చెప్పుకొన్న సంకల్పానికి తొలి ఫలశ్రుతి- బ్రహ్మోస్ క్షిపణి. రాడార్లు, యుద్ధ ట్యాంకులు సహా వివిధ ఆయుధ వ్యవస్థల నిర్వహణ అధ్వానంగా ఉందంటూ ‘కాగ్’ నివేదిక సూటిగా తప్పుపట్టిన నేపథ్యంలో- రూ.15వేల కోట్ల మేర దేశీయంగా ఆయుధాల తయారీ ప్రణాళిక నిరుడు సిద్ధమైంది.
సాయం ఆందించిన వారికి తిరిగి సాయం
సొంత నమూనాలతో 85 యుద్ధ నౌకలు నిర్మించుకునే సామర్థ్యం, సాంకేతిక ప్రజ్ఞాపాటవాలు ఇక్కడ పోగుపడినట్లు విశ్లేషణలు వెల్లడించినా- తుపాకులు, తూటాలు, శిరస్త్రాణాల్లాంటివీ విదేశాలనుంచి రప్పించుకునే ధోరణులు దేశాన్ని పరాధీనగా మిగిల్చాయి. వ్లాదివొస్తోక్‌లో కొత్తగా కుదిరిన ఒప్పందం ప్రకారం, రష్యా సైనికావసరాల నిమిత్తం భారత్ విడి భాగాలు, పరికరాల తయారీ చేపట్టనుంది. అందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మాస్కో అందించనుంది. ‘భారత్‌లో తయారీ’ (మేకిన్ ఇండియా) పథకంలో భాగంగా మన సైన్యం, వైమానిక దళాలకోసం రెండు వందల కమోవ్ 226 టి హెలికాప్టర్లను సిద్ధపరచడానికి ఉద్దేశించిన 2016నాటి నిర్ణయాత్మక ఒప్పందం దరిమిలా ఇప్పుడిది మలి అంచె. ఎన్నేళ్లుగానో ఏ దేశం మన రక్షణావసరాలు తీర్చిందో, అదే రష్యాకోసం సైనిక పరికరాల తయారీని భారత్ చేపట్టనుండటం నూతన శకారంభాన్ని సూచించేదే.
కాలపరీక్షకు నిలిచి గెలిచిన అపూర్వ బంధం తమదని, ఉభయ దేశాల మైత్రి గంగా ఓల్గాల సంగమమని భారత్-రష్యా అధినేతలు పలుమార్లు అభివర్ణించినా, ఆ సౌహార్దానికి దీటుగా ద్వైపాక్షిక బాంధవ్యం పెనవడలేదన్నది చేదు నిజం. 2016లో ఇరు దేశాల మధ్య 717 కోట్ల డాలర్లకు పరిమితమైన వాణిజ్య పరిమాణం గత ఆర్థిక సంవత్సరంలో 820 కోట్ల డాలర్లకు చేరింది. దాన్ని 3000 కోట్ల డాలర్లకు పెంపొందించాలన్న ఘన సంకల్పం వ్లాదివొస్తోక్ శిఖరాగ్ర సదస్సు కన్నా ముందే 2014 డిసెంబరులో వ్యక్తమైంది. అందుకు అనుగుణంగా మైత్రీలతలు విరబూయకపోవడానికి అసలు కారణమేమిటో రష్యా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ మధ్య అమెరికాతో ఇండియా అంటకాగుతోందని అనుమానించి ఇస్లామాబాద్ వైపు మాస్కో కొంత మొగ్గు చూపడం తెలిసిందే. తనకు అందుతున్న రక్షణ పరికరాల్లాంటివే రష్యానుంచి చైనాకు చేరుతుండటం, భారత్‌ను ఆందోళనపరచే అంశమే.
ఆలోచించి అడుగేస్తే మంచిది
బీజింగ్‌ను ఇరుకున పెట్టే ఏ చర్యనూ సమర్థించే పరిస్థితిలో లేని మాస్కో- అమెరికా ఒత్తిళ్ల దృష్ట్యా ఎదుర్కొంటున్న సంకటాల్ని అధిగమించేందుకు తమ చమురు, గ్యాస్, బొగ్గు క్షేత్రాల్లో పెట్టుబడుల ప్రవాహాలను అభిలషిస్తోంది. గల్ఫ్ దేశాల్లో అనిశ్చితి కారణంగా రష్యా రూపేణా మెరుగైన ఇంధన సరఫరాదారు లభించడం ఇండియాకు కలిసొచ్చేదే అయినా, కొన్ని అంశాల్లో ఆచితూచి అడుగేయడం అన్నిందాలా మంచిది. భారత్‌కు పది లక్షల కోట్ల రూపాయలకుపైగా ఆయుధ సరఫరాలు చేయనున్నట్లు రష్యా అధికారగణం చెబుతుండగా, వచ్చే ఇరవై ఏళ్లలో ఇరవైకి పైగా అణు విద్యుత్కేంద్రాల్ని ఇక్కడ నెలకొల్పనున్నామని ఫుతిన్ అంటున్నారు. అణు విద్యుత్కేంద్రాల్లో ప్రమాదం సంభవిస్తే అంచనాలకు అందని నష్టతీవ్రత ఉంటుందంటున్న ‘గ్రీన్‌పీస్’ సంస్థ- అణు వ్యర్థాల్ని సురక్షితంగా వదిలించుకునే మార్గమే లేదంటోంది. సంక్లిష్టభరిత భౌగోళిక ఆర్థిక రాజకీయ వాతావరణంలో, మాస్కోతో భాగస్వామ్యం ఉభయతారకం అయ్యేలా మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి!
ఇదీ చూడండి:మోదీ 2.0: నరేంద్రుడి సంచలనాల సెంచరీ