భారతదేశం 71వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొన్న సందర్భంగా రాజ్యాంగం మహిళలు, బాలలకు ప్రసాదించిన హక్కులను మనమెంత సమర్థంగా అమలు చేస్తున్నామో సింహావలోకనం చేసుకోవడం అవసరం. చట్టం ముందు అందరూ సమానులేనని, అందరికీ సమానంగా చట్టపరమైన రక్షణ లభిస్తుందని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అధ్యాయం భరోసా ఇచ్చింది. కుల, మత, జాతి, మత, లింగ, ప్రాంతీయపరంగా ఎవరిపైనా దుర్విచక్షణ చూపకూడదని నిషేధం విధించింది. మహిళలు, బాలల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం ఏవైనా ప్రత్యేక చర్యలు తీసుకోదలిస్తే, ఆ పని నిక్షేపంగా చేయవచ్చునని 15 (3)వ రాజ్యాంగ అధికరణ ఉద్ఘాటించింది. మహిళలను ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావడం, బాలల హక్కులను సంరక్షించడం జాతి బాధ్యత అని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు. మరి వారి దార్శనికతను మనమెంతవరకు నెరవేర్చగలిగామన్నది 71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అనుశీలించడం సందర్భోచితంగా ఉంటుంది.
గణతంత్ర గమనం.. ఒడుదొడుకులమయం
మహిళా సమానత్వం, మహిళా హక్కుల గురించి రాజ్యాంగ నిర్మాతలకు మొదటి నుంచి పూర్తి అవగాహన ఉంది. వాటిని తప్పనిసరిగా అమలు చేయాలన్న దృఢసంకల్పమూ ఉంది. ఆరంభంలో కొన్ని ఒడుదొడుకులు ఎదురైనా, 1950లలో హిందూస్మృతి బిల్లుల ఆమోదంతో ముందడుగు పడింది. అయితే హక్కుల సంరక్షణా రథం జోరు అందుకోవడానికి మరికొంత సమయం పట్టింది. 1961లో మాతృత్వ సంక్షేమ చట్టం, వరకట్న నిషేధ చట్టాలు ఆమోదం పొందాయి. కేవలం చట్టాలతోనే సమూల మార్పు సాధించలేమని అనుభవంలో తెలిసివస్తోంది. ఉదాహరణకు భారతీయ శిక్షాస్మృతిలోని 304 బి సెక్షన్ వరకట్న మరణాలను హేయమైన నేరంగా పరిగణిస్తోంది. అంతమాత్రాన వరకట్నం కోసం వేధించడం, కోడళ్ల హత్యలు, ఆత్మహత్యలు ఆగలేదు కదా! నేడు దేశంలో గంటకొక వరకట్న మరణం సంభవిస్తోందని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించడం ఓ భీకర వాస్తవాన్ని కళ్లకు కడుతోంది. ఆచరణలో కొన్ని లోటుపాట్లున్నా మహిళలకు చట్టపరమైన రక్షణను కొనసాగించడం తప్పనిసరి. అందుకే గృహహింస నిరోధానికి ఒక చట్టం చేశాం. పని చేసేచోట మహిళలను లైంగికంగా వేధించడం నిషిద్ధమని, అసలు అలాంటివి జరగకుండా ముందే నివారించాలని, లైంగిక వేధింపులు జరిగితే కఠినంగా శిక్షించాలని నిర్దేశిస్తూ ప్రత్యేక చట్టమూ చేశాం. ఎంతో కాలం చర్చలు, తర్జనభర్జనలు జరిగిన మీదట అవి రూపుదాల్చాయి. రాజ్యాంగం తమకు భరోసా ఇచ్చిన హక్కుల్లో కొన్నింటినైనా సాధించుకోవడానికి మహిళలకు అండగా నిలిచాయి. అయితే చట్టాలు ఆశించిన ఫలితాలు ఇచ్చేలా నిరంతరం జాగరూకత పాటించాలి.
మహిళలు, పురుషులనే భేదం లేకుండా పౌరులందరికీ సముచిత జీవనాధారం, ఒకే పనికి ఒకే విధమైన వేతనాలు అందాలని రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాయి. పంచాయతీలు, పురపాలక సంఘాల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలతోపాటు మహిళలకూ రాజ్యాంగం సీట్లు కేటాయించింది. అయితే కొన్ని సీట్లలో మహిళలకు బదులు వారి భర్తలు లేక బంధువులు అధికారం చలాయిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. కొందరు అగ్రశ్రేణి రాజకీయ నాయకులు సైతం మహిళలు ఉండాల్సింది వంటింట్లోనని, వారు బయటికొచ్చి గద్దెనెక్కడం సరికాదని వ్యాఖ్యానించడం చూస్తూనే ఉన్నాం. కాబట్టి కేవలం చట్టాలతోనే పని జరగదని అర్థమవుతోంది. అందరి మనస్తత్వాల్లో, దృక్పథాల్లో మార్పు రావాలి. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విధంగా మహిళలకు సాధికారత చేకూర్చాలనే దృఢసంకల్పం అందరిలో పాదుకోవాలి. ప్రత్యేక సంరక్షణ, సహాయం పొందే హక్కు చిన్నారులకు ఉందని సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనలోని 25వ అధికరణ గుర్తించింది. 1948లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఆమోదించిన ఈ ప్రకటనను ప్రపంచ దేశాలన్నీ శిరసావహిస్తున్నాయి. తదనుగుణంగా భారత రాజ్యాంగం బాలలతో చాకిరీ చేయించడాన్ని నిషేధించింది. 14 ఏళ్లలోపు పిల్లలతో కర్మాగారాల్లో కాని, గనుల్లో కాని, మరెక్కడైనా కాని ప్రమాదభరితమైన పని చేయించకూడదని స్పష్టీకరించింది. చిన్నారులు ఆరోగ్యవంతంగా ఎదిగేట్లు జాగ్రత్త తీసుకోవాలని రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు నిర్దేశిస్తున్నాయి. స్వేచ్ఛాయుత వాతావరణంలో హుందాగా పెరిగేలా పిల్లలకు అవకాశాలు, సౌకర్యాలు కల్పించాలన్నాయి. బాలలు, యువజనుల శ్రమను దోపిడి చేయడం, నైతికంగా, భౌతికంగా వారిని నిస్సహాయులుగా వదిలివేయడం వంటివి జరగరాదంటున్నాయి. ఈ లక్ష్యాలను సాధించడానికి తగు విధానాలు రూపొందించి అమలు చేయాలని ఆదేశిస్తున్నాయి. ఇవి గొప్ప లక్ష్యాలే కాని, వాటిని ఎంతవరకు నెరవేర్చామో తరచిచూసుకోవడం ఆవశ్యకం. పిల్లల హక్కులను నిజంగా కాపాడగలుగుతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
లక్ష్యసాధనలో వైఫల్యాలెన్నో
ప్రగతిశీల సమాజంగా, సజీవ ప్రజాతంత్ర, గణరాజ్యంగా వెలిగిపోతుందనుకొంటున్న భారతదేశం నిజంగా ఏమి సాధించిందనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. లక్ష్యసాధనలో కొన్ని వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. మరి వాటిని అధిగమించడానికి మనమేం చేశాం, ఏం చేస్తున్నాం? మొదట దేశ ప్రజల ఆలోచనా విధానం మారాలి. కాలం మారుతోందని గుర్తించి తదనుగుణంగా నడచుకోవాలి. చిరకాలం ఇంటి నాలుగు గోడల మధ్య మగ్గిపోయిన భారతీయ మహిళ నేడు బయటి ప్రపంచంలోకి వస్తోంది. ‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అనే మను సూక్తికి కాలం చెల్లిపోయింది. తమకూ హక్కులు ఉన్నాయని, రాజ్యాంగం వాటికి భరోసా ఇచ్చిందని మహిళలు గ్రహించారు. సమానత్వం, గౌరవ మర్యాదల పరిరక్షణకు కట్టుబడిన రాజ్యాంగం వనితలను తమ హక్కులు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తోంది. దీన్ని ఎవరూ కాదనలేరు. నాయకులు కాని, మరెవరైనా కాని మహిళల హక్కులను కాలరాయలేరు. మహిళలు కూడా సంస్థాగతంగా సంఘటితమై తమ హక్కులను కాపాడుకోవడానికి ఉద్యమిస్తున్నారు. మన దేశ జనాభాలో 37 శాతం బాలలే అయినా గడచిన 70 ఏళ్లుగా బాలల హక్కులను అలక్ష్యం చేస్తూ వచ్చాం. ప్రపంచంలో యువ జనాభా అత్యధికంగా ఉన్నది భారత్‌లోనేనని గర్విస్తూనే బాలల గురించి పట్టించుకోకపోవడం క్షంతవ్యం కాదు. బాల్యం నుంచి చక్కని చదువులు చెప్పి, యౌవనంలో నైపుణ్యాలు గరపడం ద్వారా యువ జనాభాను దేశ ప్రగతికి చోదక శక్తిగా మలచుకోవలసిన బాధ్యత జాతి మీద ఉంది. మహిళలు, బాలల కోసం రూపొందించిన చట్టాలు, సంక్షేమ-అభివృద్ధి పథకాలు అమలవుతున్న తీరుపై సామాజిక తనిఖీ చేయాలి. వసతి గృహంలో లైంగిక అత్యాచారాలపై నిష్పాక్షికంగా, హేతుబద్ధంగా జరిపిన విచారణ ద్వారానే నేరస్తులకు శిక్షలు విధించగలిగాం. సామాజిక తనిఖీ కూడా అదే పంథాలో సాగాలి.
ఆచరణలో వెనకబాటు
పిల్లలు, ముఖ్యంగా ఆడ పిల్లల శ్రేయం కోసం జాతీయ విధానాలు చాలానే రూపొందించుకున్నాం. పిల్లల సంక్షేమానికి తరుణ వయస్కుల న్యాయ చట్టం రూపొందింది. 14 ఏళ్ల వయసువరకు బాలలకు ఉచిత విద్య ఒక హక్కుగా గుర్తించాం. ఇన్ని చట్టాలు చేసినా వాస్తవంలో పరిస్థితి వేరుగా ఉండటం శోచనీయం. కైలాస్ సత్యార్థి వంటివారు నిస్వార్థంగా కృషి చేసినప్పటికీ బాల కార్మికులతో పని చేయించే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది. సరైన వైద్య సౌకర్యాలు లేక వందల సంఖ్యలో శిశువులు ఇప్పటికీ మరణిస్తూనే ఉన్నారు. దేశంలో రోజుకు 250మంది బాలలు అదృశ్యమవుతున్నారని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు తెలుపుతున్నాయి. వసతి గృహాల్లో, శరణాలయాల్లో బాలికలపై లైంగిక అత్యాచారాల గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక శరణాలయంలో 30 మంది బాలికలపై పదేపదే అత్యాచారం జరిపిన వ్యక్తులకు ఇటీవల శిక్ష పడటం చూస్తే, రాజ్యాంగం నిర్దేశించిన రీతిలో బాలలకు ముందుగానే రక్షణ కల్పించలేకపోతున్నామని తేలుతోంది. బాలలు నేరాలకు ఒడిగట్టే ధోరణి తగ్గుతుంటే, వారి పట్ల నేరాలు పెరిగిపోతున్నాయని ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. 2016-2018 మధ్యకాలంలో బాలలపై నేరాలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. బాలలకు విద్యాహక్కును తొమ్మిదేళ్ల క్రితమే దత్తం చేసినా, ఆశించిన స్థాయిలో ఆ హక్కు అమలైందా అంటే గట్టిగా అవునని చెప్పలేని పరిస్థితి. అర్హులైన ఉపాధ్యాయులు, సరైన పాఠశాల భవనాలు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక వసతులు కొరవడటం వల్ల బాలలకు విద్యాహక్కు అరకొరగానే అమలవుతోంది. భారత గణతంత్ర రాజ్యానికి 70 ఏళ్లు నిండిన సందర్భంలో స్త్రీలు, బాలల అభ్యున్నతికి భావి కార్యాచరణ ఎలా ఉండాలో ఇప్పుడే నిర్ణయించుకోవడం ఎంతైనా అవసరం. ఆ లక్ష్యసాధనకు పకడ్బందీ ప్రణాళికను రూపొందించుకోవాలి. ఐక్యరాజ్య సమితిలో సభ్యులైన 193 దేశాలు సంతకం చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పత్రం సరిగ్గా అటువంటి ప్రణాళికే. భారతదేశం కూడా దాని మీద సంతకం చేసింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీల)ను సక్రమంగా అమలు చేస్తే, అన్ని వర్గాలతోపాటు స్త్రీలు, బాలలూ లబ్ధిపొందుతారు. ఎస్‌డీజీలలో అయిదోది స్త్రీలు, బాలికల గురించి పట్టించుకొంటోంది. లింగ సమానత్వం సాధించి, మహిళలు, బాలికలకు సాధికారత అందించాలని అందులోని అయిదో లక్ష్యం ఉద్ఘాటిస్తోంది. ఎస్‌డీజీలలో ఇతర లక్ష్యాలైన పేదరికం, అసమానతల నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, ఆర్థిక ప్రగతులను సాధించడానికి మహిళా సాధికారతే పునాది. కొత్త దశాబ్దంలో ఈ లక్ష్యాల సాధనకు జాతి యావత్తు కలిసికట్టుగా ప్రజాస్వామికంగా కృషిచేయాలి.
- జస్టిస్ మదన్ బి.లోకుర్, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి