భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్త్రో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ల కథ సమాప్తమైనట్లు తెలుస్తోంది. ఇస్త్రో ఛైర్మన్ శివన్ మాటలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించలేకపోయామని తాజాగా వెల్లడించారు శివన్. కానీ ఆర్బిటర్ చాలా బాగా పనిచేస్తోందని.. ఈ ప్రాజెక్టులో 98 శాతం విజయం సాధించామని భువనేశ్వర్‌లో వివరించారు.
"చంద్రయాన్-2 ఆర్బిటర్ చాలా బాగా పనిచేస్తోంది. అందులో 8 శాంకేతిక పరికరాలు ఉన్నాయి. ప్రతి పరికరం అనుకున్నట్లుగానే సక్రమంగా పనిచేస్తోంది. చంద్రయాన్-2 ఆర్బిటర్‌లో మరో ముఖ్య విషయం... దాని జీవిత కాలం. మేము ఒక సంవత్సర కాలం పాటు పనిచేసేలా రూపొందించాం కానీ అది ఏడున్నరేళ్లకు పెరిగింది. ఏడున్నరేళ్లపాటు దాని ద్వారా పరిశోధన జరగనుంది.
ల్యాండర్‌తో ఇప్పటి వరకు సమాచారాన్ని పునరుద్ధరించలేకపోయాం. చంద్రయాన్-2లో రెండు లక్ష్యాలు ఉండటం వల్ల 98 శాతం విజయం సాధించినట్లు చెబుతున్నాం.
గగన్‌యాన్ మిషన్ అనేది మా ముందున్న తదుపరి ముఖ్యమైన ప్రాజెక్టు. తొలిసారి మానవసహిత మిషన్‌ను వచ్చే ఏడాది చివర్లో చేపట్టబోతున్నాం. ఆ ప్రాజెక్టుపైనే పని చేస్తున్నాం."
- కె.శివన్, ఇస్త్రో ఛైర్మన్.
నేటితో పగలు పూర్తి
ఈ నెల 7న జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగుతూ గల్లంతైన ల్యాండర్‌తో కమ్యూనికేషన్ పునరుద్ధరించేందుకు ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. చంద్రుడిపై ల్యాండర్ 14 రోజుల పాటు పనిచేయాల్సి ఉంది. కానీ అది దిగిన ప్రదేశంలో 14 రోజుల పగటి సమయం నేటితో ముగిసిపోనుంది. అనంతరం రెండు వారాల పాటు సాగే రాత్రి మొదలవుతుంది. నేటి నుంచి అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీలకు చేరుకుంటాయి. ల్యాండర్, రోవర్ ఈ చలిని తట్టుకోలేవు.
విక్రమ్.. చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీ కొట్టినట్లు చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని కెమెరా తీసిన చిత్రాల ఆధారంగా ఇస్రో ఇప్పటికే ప్రకటించింది.
ఇదీ చూడండి: హనీమూన్ చెడగొట్టినందుకు భారీ జరిమానా!