కేంద్రమాజీ మంత్రి పి. చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టు నుంచి మినహాయింపును ఒకరోజు పాటు పొడిగించింది అత్యున్నత న్యాయస్థానం. సీబీఐ కేసులో రిమాండ్కు అప్పగించే ఆదేశాలు సహా చిదంబరం దాఖలు చేసిన రెండు పిటిషన్లపై జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించనుంది.
విచారణ ప్రశోత్తరాలు బయటపెట్టండి: సిబల్
చిదంబరం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. 2018 డిసెంబర్ 19, 2019 జనవరి 1, 21 తేదీల్లో చిదంబరం విచారణ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేవనెత్తిన ప్రశ్నోత్తరాల ప్రతులను సుప్రీం ఎదుట దాఖలు చేసేందుకు ఆదేశాలివ్వాలని కోరారు. ఈడీ ఆరోపిస్తున్నట్లుగా... వారి ప్రశ్నలకు చిదంబరం దాటవేసే ధోరణిలో సమాధానామిచ్చారా అనే అంశం ప్రశ్నోత్తర ప్రతులతో బయటపడుతుందని వెల్లడించారు.
"వారు ఇష్టం వచ్చిన రీతిలో పత్రాలు దాఖలు చేసి కేసు డైరీ అని తెలపడం సరికాదు. కస్టడీకి అప్పగించాలని కోరేందుకు ఇష్టంవచ్చిన మార్గంలో పత్రాలను సమర్పించడం ఆక్షేపణీయం."
-వాదనల సందర్భంగా కపిల్ సిబల్
నిబంధనలు అప్పుడు అమలులో లేవు: సింఘ్వీ
కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కూడా చిదంబరం తరఫున వాదనలు వినిపించారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును... వ్యక్తిగత గోప్యతను హరించకూడదని కోర్టు ఎదుట నివేదించారు. పీఎంఎల్ఏ యాక్టుకు 2009లో సవరణలు చేపట్టారని, చిదంబరానికి ఆపాదిస్తున్న కేసు 2007-08లో జరిగిందని తెలిపారు.
"ఒక ప్రముఖ వ్యక్తిని దోషిగా చిత్రీకరిస్తున్నారు. అతిక్రమించారని ఆరోపిస్తున్న నిబంధనలు నాటి సమయంలో అమలులో లేవు."
-సుప్రీం ఎదుట అభిషేక్ సింఘ్వీ వాదన
ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. పిటిషనర్ తరఫు న్యాయవాదులు చేసిన తాజా అభ్యర్థనకు త్వరలో సమాధానమిస్తామని కోర్టుకు విన్నవించారు.
యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాల్లో చిదంబరం ఆర్థికమంత్రిగా పనిచేశారు. ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ (ఎఫ్ఐపీబీ) అనుమతులు ఇచ్చే విషయంలో రూ. 305 కోట్ల ముడుపులను స్వీకరించారన్న ఆరోపణలతో 2017, మే 15న సీబీఐ... ఆయనపై కేసు దాఖలు చేసింది. అదే ఏడాది మనీ ల్యాండరింగ్ ఆరోపణలతో ఈడీ మరో కేసు నమోదు చేసింది.
ఇదీ చూడండి: ఔరా: జుట్టుకి మంటలంటించి 'ఫైర్ కట్'