ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత చిదంబరాన్ని అక్టోబర్ 24 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది దిల్లీ కోర్టు. ఈ ఏడు రోజులపాటు చిదంబరాన్ని నిర్బంధ విచారణ చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతించింది.
ఈ కేసును విచారిస్తోన్న ప్రత్యేక న్యాయమూర్తి అజయ్‌కుమార్ కుహార్... చిదంబరం విజ్ఞప్తి మేరకు ప్రత్యేక గది, ఇంటి భోజనం, మందులు, కళ్లద్దాలు, వెస్ట్రన్ టాయిలెట్ సమకూర్చాలని ఈడీని ఆదేశించారు. అలాగే చిదంబరంతో ఆయన కుటుంబ సభ్యులు, ఆయన తరపు న్యాయవాదులు రోజుకో అరగంట సేపు మాట్లాడడానికి అనుమతించింది. ఈడీ కూడా దీనికి అభ్యంతరం తెలపలేదు.
అలాగే చిదంబరానికి ప్రతి 48 గంటలకు ఓ సారి వైద్యపరీక్షలు చేయించాలని, అక్టోబర్ 24న తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఈడీని ఆదేశించింది.
చిదంబరాన్ని బుధవారం అదుపులోకి తీసుకుని విచారించిన ఈడీ.. ఆయనను 14 రోజుల పాటు నిర్బంధ విచారణ చేపట్టేందుకు అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరింది. మరోవైపు సీబీఐ నమోదు చేసిన ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 24 వరకు పొడిగించింది న్యాయస్థానం.
ఇదీ చూడండి: భారత్ జవాన్లపై బంగ్లా సైన్యం కాల్పులు- ఒకరు మృతి