కేంద్ర దర్యాప్తు సంస్థకు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర మాజీ ఆర్థికమంత్రి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై స్పందించాలని ఆదేశించింది. 7 రోజుల్లోగా నివేదిక అందించాలని స్పష్టం చేసింది. ఈ నెల 23న తదుపరి విచారణ ఉంటుందని తెలిపింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ కస్టడీ ఎదుర్కొంటున్న చిదంబరం.. తనకు బెయిల్ మంజూరు చేయాలని బుధవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు 14 రోజుల సీబీఐ కస్టడీ విధించిన ట్రయిల్ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ను కేంద్ర మాజీ మంత్రి వెనక్కి తీసుకున్నారు.
73 ఏళ్ల కాంగ్రెస్ నేతను ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసింది. చిదంబరంపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని.. అందుకే కస్టడీకి అప్పగించినట్టు ట్రయిల్ కోర్టు తెలిపింది. కేంద్ర మాజీ మంత్రిని అధికారులు తిహార్ జైలుకు తరలించారు.
యూపీఏ హయాంలో మంత్రిగా ఉండగా... విదేశీ నిధులు పొందేందుకు ఐఎన్ఎక్స్ మీడియాకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్నది చిదంబరంపై ఉన్న ప్రధాన ఆరోపణ.
ఇదీ చూడండి:- రూపాయికే 4 ఇడ్లీల కమలాత్తాళ్కు మహీంద్రా భరోసా