1971 బంగ్లాదేశ్ యుద్ధం అనంతరం.. కశ్మీర్ వివాదం నుంచి క్రమక్రమంగా దూరమవుతూ వచ్చింది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి. ఇక అప్పటినుంచి భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు ఏమంతా ఫలప్రదంగా లేవు. అయితే.. సిమ్లా ఒప్పందం అనంతరం.. ఇరు అణ్వాయుధ దేశాల మధ్య సంబంధాలు ఎలా కొనసాగాయో ఓ సారి చూద్దాం.
1974: భారత్ మొదటి అణుపరీక్ష
1974లో భారత్ మొదటి అణు పరీక్ష నిర్వహించిన అనంతరం.. ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. మొట్టమొదటి సారిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాల్లో లేని భారత్ అణుపరీక్షలు నిర్వహించడం విశేషం.
1989: జమ్మూలో సాయుధ ప్రతిఘటన ప్రారంభం
1989లో జమ్ముకశ్మీర్‌లో సాయుధ ప్రతిఘటన ప్రారంభమైంది. దీనికి కారణం పాకిస్థానేనని, తిరుగుబాటుదారులకు ఆయుధాలు సమకూర్చి, శిక్షణనిచ్చి ఉద్యమానికి ఆజ్యం పోస్తోందని భారత్ ఆరోపించింది. అయితే.. తమ ప్రత్యక్ష పాత్ర ఉందన్న ఆరోపణల్ని పాక్ ఖండించింది. నైతిక, దౌత్య మద్దతు మాత్రమే తాము అందిస్తున్నామని తెలిపింది.
అనంతరం.. సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించే ముందు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకునేలా ఇరు దేశాల మధ్య 1991లో ఒప్పందం కుదిరింది. భవిష్యత్తులోనూ గగనతల ఉల్లంఘనలను అడ్డుకునే దిశగా నిర్ణయించాయి. ఏడాది తర్వాత.. రసాయన ఆయుధాల వాడకం నిషేధంపై దిల్లీలో ఉమ్మడి ప్రకటన చేశాయి.
1996: నియంత్రణ రేఖ వెంబడి సైనికాధికారుల భేటీ...
వరుస ఘర్షణలతో ఇరు దేశాల మధ్య క్రమక్రమంగా ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. పరిస్థితుల్ని చక్కదిద్దే దిశగా భారత్, పాక్ సైనికాధికారులు 1996లో నియంత్రణ రేఖ వద్ద సమావేశమయ్యారు. 1998లో ఇరు దేశాలు అణు పరీక్షలు నిర్వహించిన కారణంతో.. అంతర్జాతీయ ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
1999: బస్సులో లాహోర్ వెళ్లిన వాజ్‌పేయీ....
పతాకస్థాయికి చేరుతున్న వివాదాన్ని తగ్గించే దిశగా మరుసటి సంవత్సరం... అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలిసేందుకు బస్సులో బయల్దేరారు. శాంతియుత వాతావరణమే లక్ష్యంగా ఇరు దేశ ప్రధానులు లాహోర్ ప్రకటనపై సంతకం చేశారు.
ఆ తర్వాత కార్గిల్ యుద్ధం కొనసాగినంత కాలం.. తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి. భారత భూభాగాన్ని పాక్ దళాలు ఆక్రమించుకున్నాయి. అయితే.. భారత్ పోరాడి ఆ భూభాగాన్ని తిరిగి స్వాధీనపర్చుకుంది. అప్పుడు సయోధ్య కుదిర్చేందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించింది.
పార్లమెంటు, జమ్మూ అసెంబ్లీపై దాడి...
అనంతర కాలంలో 21 శతాబ్దపు ప్రారంభంలో భారత్‌పై దాడులు విపరీతంగా పెరిగాయి. 2001లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీపై దాడి జరిగింది. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత భారత పార్లమెంట్‌పై ముష్కరులు జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు.
2004లో ఇస్లామాబాద్ సార్క్ శిఖరాగ్ర సదస్సు వేదికగా.. భారత్ ప్రధాని వాజ్‌పేయీ, పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రత్యక్ష చర్చలు జరిపారు. అప్పటినుంచి ఇరు వర్గాల మధ్య ఉమ్మడి సంభాషణ ప్రక్రియలు కొనసాగాయి.
2008లో కశ్మీర్ వ్యాప్తంగా వాణిజ్యానికి మార్గం సుగమమైంది.
2008: ముంబయి దాడుల వెనుక లష్కరే తోయిబా..!
అనంతరం... 2008లో ముంబయి ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య శాంతికి మార్గాలు మూసుకుపోయాయి. 166 మందిని పొట్టన పెట్టుకున్న ఈ పేలుళ్ల వెనుక పాక్ ఆధారిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబానే కారణమని భారత్ నిందిస్తూ వచ్చింది.
తదనంతరకాలం... భారత్‌కు తొలిసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఎన్నికైన సమయంలో సంబంధాలు పునరుద్ధరించే దిశగా ప్రయత్నాలు జరిగాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడమే కాకుండా.. మరుసటి ఏడాది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ షరీఫ్ పుట్టినరోజు వేడుకల కోసం లాహోర్ వెళ్లారు మోదీ.
పఠాన్‌కోట్, ఉరీ సెక్టార్లలో ఉగ్రదాడులు...
తర్వాతి కాలంలో మెల్లమెల్లగా కశ్మీర్లో తీవ్రమైన సంఘర్షణలు బయటపడ్డాయి. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి జరిగిన కొన్ని నెలల అనంతరం.. హిజ్బుల్ ముజాహిద్దీన్ నేత బుర్హాన్ వానీ ఎన్కౌంటర్లో మరణించాడు. భారత్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. అల్లర్లు తీవ్రరూపం దాల్చాయి. 2 నెలలకు భారత సైనిక శిబిరం ఉరీ వద్ద మరో ఉగ్ర దాడి జరిగింది. ఈ ఘటనలో 18 మంది సైనికులు అమరులయ్యారు.
ఇక అప్పటినుంచి భారత్ ఏ మాత్రం వెనక్కితగ్గలేదు. పరిస్థితులు మారిపోయాయి. పాకిస్థాన్ కేంద్రంగా వచ్చే సీమాంతర ఉగ్రవాదంపై బహిరంగంగానే ఆరోపిస్తూ వచ్చింది. ఉరీ దాడి జరిగిన 11 రోజులకు భారత సైన్యం... నియంత్రణ రేఖ వెంట పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు చేసింది.
2019: పుల్వామా దాడితో క్షీణించిన సంబంధాలు...
2019లో పుల్వామాలో జరిగిన మరో భయంకరమైన ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. సీఆర్పీఎఫ్ బస్సుపై ఆత్మాహుతి దాడితో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడితో పాకిస్థాన్‌ను ఒంటరి చేసే ప్రయత్నం చేసింది భారత్. అంతర్జాతీయ వేదికలపై తన గళాన్ని వినిపించింది. పుల్వామా దాడికి పాక్ కేంద్రంగా నడిచే జైషే మహ్మద్ బాధ్యత వహించగా.. పాకిస్థాన్‌లోని జైషే శిక్షణ శిబిరాలపై భారత్ మరోసారి వైమానిక దాడులు నిర్వహించింది.
అనంతరం.. పాక్ జెట్లు భారత భూభాగంలోకి చొచ్చుకురావడం.. వివాదానికి దారితీసింది. అప్పట్లో పరస్పరం దాడులు జరిపాయి.
అంతర్జాతీయ వేదికపై భారత్ విజయం...
కొద్ది నెలల అనంతరం.. అంతర్జాతీయ వేదికపై భారత్ భారీ విజయం పొందింది. భారత మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ మరణశిక్షను పునఃసమీక్షించాలని పాక్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. దౌత్య సాయం అందించాలని తీర్పు వెలువరించింది.
ఆ తర్వాత భారత్ విధాన పరంగా సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని రద్దు చేసింది. ఇంకా రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.
మరోమారు చర్చకు...
ఈ అంశాన్నే పాక్ అంతర్జాతీయం చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. అన్నింటా చుక్కెదురైంది. అయితే.. భారత్ ఇది తమ అంతర్గత సమస్యని ఎన్నోసార్లు స్పష్టం చేసింది. అంతర్జాతీయ వేదికలపై మద్దతూ లభించింది. గత నెలలో కశ్మీర్ అంశంపై ఐరాస భద్రతా మండలి రహస్య సంప్రదింపులకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఐరాస సర్వసభ్య సమావేశాల్లో కశ్మీర్ అంశం చర్చకు వచ్చే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. ఇరు దేశ ప్రధానులు ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి :