గగనతలంలో మరింత మెరుగ్గా నిఘా ఉంచడం కోసం ఇజ్రాయెల్ నుంచి రెండు ఫాల్కన్ ముందస్తు హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థల (అవాక్స్)ను భారత వైమానిక దళం సమకూర్చుకోనుంది. వీటి ఖరీదు 100 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో తీవ్ర స్థాయిలో సరిహద్దు వివాదం ఏర్పడిన నేపథ్యంలో భారత్ ఈ కీలక నిఘా వ్యవస్థలను సమకూర్చుకోనుంది. భారత వైమానిక దళం వద్ద ఇప్పటికే మూడు ఫాల్క్‌న్ అవాక్స్ వ్యవస్థలు ఉన్నాయి. అదనంగా రెండు వ్యవస్థలను సమకూర్చుకోవడం వల్ల భారత గగనతల రక్షణ యంత్రాంగం మరింత మెరుగుపడుతుంది. వీటి కొనుగోలుకు ఆమోదం తెలిపే ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) తదుపరి సమావేశంలో ఇది పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది అని ఓ అధికారి పేర్కొన్నారు. అవాక్స్‌ను ఆకాశంలో నిఘా నేత్రం గా పేర్కొంటారు.
ఇది చాలా దూరం నుంచే శత్రువుల యుద్ధవిమానాల, క్షిపణులు, బలగాలు కదలికలను పరిశీలించగలదు. మన గగనతలంలో ఉంటూనే శత్రు భూభాగంలోని పరిస్థితులపై కన్నేస్తుంది. ఫాల్కన్ అవాక్స్‌ను రష్యా నుంచి కొనుగోలు చేసిన ఐఎల్-76 రవాణా విమానంపై అమర్చారు. వీటికి తోడు భారత్ వద్ద స్వదేశీయంగా అభివృద్ధి చేసిన రెండు గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. గత ఏడాది బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన చేపట్టిన దాడులకు ప్రతి స్పందనగా పాకిస్థాన్ యుద్ధ విమానాలు ఎదురుదాడికి యత్నించినప్పటి నుంచి రెండు అవాక్స్‌ను వేగంగా సమరూర్చుకోవాలన్న చర్చ సాగుతోంది. భారత్‌తో పోలిస్తే పాక్ వద్దే ఎక్కువ అవాక్స్ ఉన్నట్లు అంచనా.
అక్టోబర్ నాటికి గగనతల రక్షణ విభాగం..
చైనాతో ఉద్రికత్తల నేపథ్యంలో రక్షణ బలగాల పునర్నిర్మాణ ప్రక్రియను సైనిక వ్యవహారాల విభాగం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వైమానిక దళం ఆధ్వర్యంలో కొత్తగా గగనతల రక్షణ కమాండ్ ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు కానుంది. అక్టోబర్ రెండోవారంలో ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. త్రివిధ దళాల వద్ద ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలను ఏకతాటి పైకి తెచ్చేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ఆకాశంలో ఉమ్మడి రక్షణ కవచం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. వైమానిక దళ ఉప అధిపతి ఎయిర్ మార్షల్ హెచ్.ఎస్. అరోరా నేతృత్వంలోని కమిటీ దీనిపై అధ్యయనం చేసి కొన్ని సూచనలు చేసింది. కేరళలోని కోచీ లేదా కర్ణాటకలోని కార్వార్ కేంద్రంగా సముద్ర కమాండ్‌ను ఏర్పాటు చేయాలని కూడా సైనిక వ్యవహారాల విభాగం భావిస్తోంది. సైనిక దళాల్లో ఉమ్మడి విభాగాలు (థియేటర్ కమాండ్స్)తో పాటు ఉమ్మడి సైనిక కమాండ్లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్‌కు ప్రభుత్వం అప్పగించింది.
ఎన్సీసీ క్వాడెట్ల శిక్షణకు యాప్
దేశంలో ఎన్సీసీ క్యాడెట్ల ఆన్లైన్ శిక్షణ కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ఒక మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. కొవిడ్-19 నేపథ్యంలో విధించిన ఆంక్షల వల్ల క్యాడెట్ల శిక్షణపై ప్రభావం పడిందని, అందువల్ల డిజిటల్ మాధ్యమం ద్వారా దాన్ని చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. డీజీఎస్సీసీ అనే ఈ యాప్‌లో శిక్షణకు సంబంధించిన అంశాలు, సిలబస్ వీడియోలు ఉంటాయని పేర్కొంది.