భారత దేశం అంటేనే- భిన్న భాషలు, కులాలు, మతాల కదంబం. ఆ భిన్నత్వంలో ఏకత్వమే భారతావని సమైక్యతాసారం. ‘భారతీయులమైన మేము...’ అంటూ రాసుకొన్న రాజ్యాంగం గానీ, ‘భారతదేశం నా మాతృభూమి’ అంటూ పాఠశాల స్థాయిలో పసినోళ్లలో వేదఘోషలా ప్రతిధ్వనించే ప్రతిజ్ఞ గానీ ఈ జాతికి నేర్పిన సంస్కారం- సహనశీలం. అయిదేళ్లకోమారు వచ్చే సార్వత్రిక ఎన్నికల సందడికి భిన్నంగా పదేళ్లకోసారి జరిగే జనగణన- దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి తలుపును తట్టి పలకరించే నిశ్శబ్ద ఉత్సవం! ఈసారి ఆ ఉత్సవం ఉద్రిక్తతలకు ఊపిరులూదుతోంది. జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్)కు సహకరించేది లేదంటూ పలు రాష్ట్రప్రభుత్వాలు కారాలు, మిరియాలు నూరుతున్నాయి; తీర్మానాలూ చేస్తున్నాయి. ఎన్‌పీఆర్‌పై భయసందేహాలు అవసరంలేదని కేంద్ర హోంమంత్రి పార్లమెంటు సాక్షిగా భరోసా ఇస్తున్నా ఆందోళనలు సద్దుమణగడంలేదు. 2003నాటి చట్టంలో ఆ మేరకు సవరణలు చేయాల్సిందేనంటున్న విపక్షాల డిమాండ్లలోనూ హేతుబద్ధత లేకపోలేదు. కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా పరిస్థితులు ఇంతగా అదుపు తప్పడానికి, సామాజిక సహనశీలతే కదలబారి సామాన్య జనమూ భయకంపితులు కావడానికి పుణ్యంకట్టుకున్న పరిణామక్రమం- ఇదిగో చిత్తగించండి!
ఎన్‌పీఆర్.. అసోంకే పరిమితం
ప్రభుత్వాలు రూపొందించే విధానాలు, చేపట్టే చర్యలు విశాల జనహితం కోసమేనని ప్రజలు పూర్తిగా విశ్వసించడం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొనేలా సర్కార్లు వ్యవహరించడం- ప్రజాస్వామ్య స్ఫూర్తిసారం. దశాబ్దాలుగా అక్రమ వలసలు పోటెత్తి అసోమ్ లాంటిచోట్ల స్థానికులే మైనారిటీలుగా మారిపోయే వాతావరణాన్ని సహించలేక రేగిన జనాందోళన ఒకనాడు యావద్దేశాన్నీ అట్టుడికించిందన్నది వాస్తవం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక రెండేసార్లు జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ) రూపకల్పన జరిగినా, ఆ రెండూ అసోమ్‌కే పరిమితమయ్యాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా జనగణన (సెన్సెస్), దానివెన్నంటి జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) రూపకల్పనకు ముందస్తు ఏర్పాట్లు సాగుతుండగా, వాటిపై వ్యక్తమవుతున్న తీవ్రాందోళనలకు మూలాలు అసోమ్ రెండో ఎన్‌ఆర్‌సీలో ఉన్నాయి. ఆ ఈశాన్య రాష్ట్రంలో అక్రమ వలసదారుల్ని గుర్తించడానికంటూ సాక్షాత్తు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన ఎన్‌ఆర్‌సీ క్రతువు సాంతం తప్పులతడకగా సాగింది. ఎన్‌ఆర్‌సీ చిట్టాలనుంచి తొలుత 40లక్షల మంది జారిపోగా, తుది జాబితాలోకి ఎక్కనివారి సంఖ్య దాదాపు 20లక్షలుగా నిగ్గుతేలింది. అందులోనూ హిందువులదే మెజారిటీ అని లెక్కతేలడంతో- పొరుగున మూడు దేశాలనుంచి మతపర హింస తాళలేక పారిపోయివచ్చిన వారిలో ముస్లిములు మినహా తక్కిన మతస్థుల వారికి- భారత పౌరసత్వం కల్పించేలా చట్టాల్ని కేంద్రం సవరించడంతో ఆందోళనల అగ్గిరాజు కొంది. ఏ మతం అన్నదాంతో నిమిత్తం లేకుండా అక్రమ వలసదారులందరినీ తిప్పి పంపనిదే తమ మనుగడ దుర్లభమంటూ ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమన్నాయి. పౌరసత్వ సవరణ చట్టంలో చూపిన మతపర దుర్విచక్షణ రాజ్యాంగబద్ధం కాదన్న వాదనలతో సుప్రీంకోర్టులో కేసులు, దేశవ్యాప్తంగా పౌరపట్టిక రూపొందిస్తామన్న ప్రకటనలతో తమ పౌరసత్వానికీ ఎసరు వస్తుందన్న మైనారిటీల భయాందోళనలు- వాతావరణాన్ని ఉద్విగ్నభరితం చేశాయి. ఊహాతీతంగా ఉద్రిక్తతలు పెచ్చరిల్లినచోట పదుల సంఖ్యలో అభాగ్యుల ప్రాణాలు కడతేరిపోయాయి. జాతీయత అన్నది పౌరుల జీవన్మరణ సమస్యగా మారి, వివాదాస్పద నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాల అసమ్మతికి కారణమవుతున్నవేళ- దిద్దుబాటు చర్యలకు కేంద్రమే పూనిక వహించాలి!
ఎలాంటి పత్రాలు అడగబోం...
దేశంలో నివసిస్తున్న ప్రతిఒక్కరి సమగ్ర సమాచార నిధిని నిక్షిప్తం చేయడానికి యూపీఏ ప్రభుత్వం ఎన్‌పీఆర్‌ను మొదలుపెట్టింది. క్రితంసారి జనగణనతో పాటు ఎన్‌పీఆర్ వివరాల సేకరణా జరిగినా ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేకపోయింది. గతంలో మాదిరిగానే అవే ప్రశ్నలతో ఎన్‌పీఆర్ చేపడితే అసలు గొడవే లేకపోను! గతంలో కంటే పది కొత్త ప్రశ్నల్ని పౌరులకు సంధించదలచిన ఎన్‌పీఆర్ అందులో ‘ఇంతకుముందు ఎక్కడ ఉండేవారు?’ లాంటి వాటికి సమాధానాలు రాబట్టదలచింది. ఎన్‌పీఆర్ వివరాల నమోదు సందర్భంగా సిబ్బంది ఎలాంటి పత్రాలూ అడగబోరని, ఎంతవరకు సమాచారం ఇవ్వాలన్న స్వేచ్ఛ ప్రజలకే ఉంటుందని, సమగ్ర వివరాలు చెప్పని పక్షంలో ఎవరి పేరు పక్కనా ప్రత్యేకంగా ‘డౌట్‌ఫుల్ (డి)’ అంటూ మార్కుపెట్టరని అమిత్ షా స్పష్టీకరిస్తున్నారు. 2003నాటి సవరించిన పౌరసత్వ నిబంధనల్లో ఉన్నది వేరు! చట్టాన్ని సవరించకుండా ఇచ్చే నోటిమాట హామీలు సామాజిక ఆందోళనల్ని ఎలా ఉపశమింపజేయగలవు?
సీఎంకే సరైన పత్రాలు లేవు.. ఇక పేదల వద్ద ఎలా
వాజ్‌పేయీ జమానాలో రూపొందిన పౌరసత్వ నిబంధనలు- ఎన్‌పీఆర్‌లోని ప్రతి వ్యక్తి, కుటుంబం వెల్లడించిన వివరాల్ని స్థానిక రిజిస్ట్రార్ పరిశీలిస్తారని, ఎవరి పౌరసత్వమైనా సందేహాస్పదమైనప్పుడు మరింత దర్యాప్తు కోరుతూ ఆ విషయాన్నే నమోదు చేస్తారని పేర్కొంటున్నాయి. ఈసారి ఎన్‌పీఆర్ వెన్నంటే దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీ రూపకల్పనా జరుగుతుందన్న ప్రకటనల నేపథ్యంలో- తమ జాతీయతకు రుజువులు ఎలా చూపించాలన్నదే కోట్లాది అభాగ్యుల్ని, పలు రాష్ట్ర ప్రభుత్వాల్ని ఒక్కతీరుగా వేధిస్తోంది. ‘ఎప్పుడు పుట్టావని అడిగితే పత్రం ఇవ్వడానికి నాకే దిక్కు లేదు... ఇక పేదల వద్ద ఎలా ఉంటుంది?’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మొత్తం 70మంది సభ్యుల దిల్లీ అసెంబ్లీలో 61మందికి జనన ధ్రువీకరణ పత్రాలు లేవంటూ, తామంతా వెళ్లి నిర్బంధ శిబిరాల్లో కూర్చోవాలా అని కేజ్రీవాల్ తాజాగా విరుచుకుపడ్డారు. ఎన్‌డీయే భాగస్వామి అయిన జేడీ (యూ)- ఎన్‌ఆర్‌సీని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చి, కొత్త ప్రశ్నలేవీ అడగకుండా ఎన్‌పీఆర్ చేపట్టాలంటూ అసెంబ్లీలో తీర్మానమే ఆమోదించింది. దాదాపు భాజపాయేతర పార్టీ ప్రభుత్వాల పంథాయే అది. పార్టీగత భేదభావాలు కాదు, సామాజిక సహిష్ణుత కదలబారుతున్న ప్రమాదాన్ని గుర్తించి కేంద్రం ముందడుగెయ్యాలి!
దేశ వ్యాప్తంగా 10 కోట్ల మందికి ప్రమాదం..
మంచి చెయ్యడమే కాదు మంచిగానూ చెయ్యాలన్నారు మహాత్మాగాంధీ. కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం కొత్తగా కొందరికి పౌరసత్వం ఇచ్చేదేగాని, ఏ ఒక్కరి పౌరసత్వాన్ని ఊడబెరికేది కాదని కేంద్రం పదే పదే చాటుతున్నా- అనుమానాలు సడలకపోవడం సర్కారు వ్యవహారసరళిలో లోపాల్నే పట్టిస్తోంది. అసోమ్‌లో అమలుచేసిన ఎన్‌ఆర్‌సీలో రాష్ట్ర ప్రజల్లో ఏడుశాతం పౌరసత్వ జాబితా నుంచి జారిపోయారని, అదే ప్రాతిపదిక అయితే దేశవ్యాప్తంగా పదికోట్లమంది జాతీయత ప్రమాదంలో పడుతుందన్న అంచనాలు భీతిల్లజేస్తున్నాయి.
ఖలిస్థాన్ ఉద్యమం...
సిక్కు వేర్పాటు ఖలిస్థాన్ ఉద్యమానికి తిరిగి ప్రాణం పోయడానికి పాకిస్థాన్ పావులు కదుపుతోందన్న సమాచారం ఉంది. అయినా, అక్రమ వలసదారుల్లో సిక్కులనూ అక్కునజేర్చుకోవాలనే కేంద్రం తీర్మానించింది. నిఘా దర్యాప్తు సంస్థల అభ్యంతరాల్ని తోసిపుచ్చి పౌరసత్వ జారీలో జాగ్రత్తగా వ్యవహరిస్తామంటున్న కేంద్రం- అలాంటప్పుడు ముస్లిములను మాత్రమే మినహాయించి అప్రతిష్ఠ మూటగట్టుకోవాల్సిన పనేముంది? ‘సబ్ కా విశ్వాస్’ అని నినదిస్తూ అందరి నమ్మకాన్ని చూరగొంటామని ప్రకటిస్తున్న ఎన్‌డీయే సర్కారు- చేతల రూపేణా జరూరు నిర్ణయాలతో జనగణ మనస్పర్ధల్ని తొలగించాలి!
-పర్వతం మూర్తి.