దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 75,829 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 940 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను ఆదివారం వెల్లడించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.
మొత్తం కేసుల సంఖ్య 65,49,374కు చేరింది. ప్రస్తుతం 9,37,625 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరణాల సంఖ్య 1,01,782కి పెరిగింది. 55 లక్షల మంది డిశ్చార్జి అయ్యారు.
పెరుగుతున్న టెస్టులు
కరోనా కేసులను వేగంగా నిర్ధరించేందుకు పరీక్షల సంఖ్యను గణనీయంగా పెరిగింది. శనివారం ఒక్కరోజే 11,42,131 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 7,89,92,534కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.
అక్టోబర్ 3 నాటికి దేశంలో కరోనా పరీక్షల సామర్థ్యం 7.7 కోట్లకు చేరిందని కేంద్ర వైద్య శాఖ తెలిపింది. జనవరిలో ఈ సామర్థ్యం కేవలం ఒకటిగా ఉందని పేర్కొంది. పరీక్షల సంఖ్యను పెంచడం వల్ల కేసులను త్వరగా గుర్తించి.. చికిత్స అందించగలుగుతున్నామని వెల్లడించింది. తద్వారా మరణాలను అడ్డుకోగలుగుతున్నామని స్పష్టం చేసింది.