దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్నప్పటికీ.. రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు అత్యల్పంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని పేర్కొంది. గత నెల 2.82 శాతంగా ఉన్న మరణాల రేటు.. తాజాగా 2.72 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
రికవరీ రేటు రికార్డు స్థాయిలో 62.42 శాతానికి చేరగా.. 18 రాష్టాలు, కేంద్రపాలిత పాంత్రాల్లో జాతీయ సగటు కన్నా రికవరీ రేటు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.
రాష్టాల వారీగా మరణాల రేటు (శాతాల్లో)...
కేరళ (0.41), ఝార్ఖండ్ (0.71), బిహార్ (0.82), తెలంగాణ (1.07), తమిళనాడు (1.39), హరియాణా (1.48), రాజస్థాన్ (2.18), పంజాబ్ (2.56), ఉత్తర్‌ప్రదేశ్ (2.66). మణిపుర్, నాగాలాండ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, దమణ్ దీవ్, మిజోరం, అండమాన్ నికోబార్ దీవులు, సిక్కింలో సున్నా మరణాల రేటు ఉంది.
రికవరీ రేటు ఇలా (శాతాల్లో)...
బంగాల్ (64.94), ఉత్తర్‌ప్రదేశ్ (65.28), ఒడిశా (66.13), ఝార్ఖండ్ (68.02), పంజాబ్ (69.26), బిహార్ (70.40), గుజరాత్ (70.72), మధ్యప్రదేశ్ (74.85), హరియాణా (74.91), రాజస్థాన్ (75.65), దిల్లీ (76.81)గా నమోదయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం సాయంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను ఎదుర్కొనేందుకు కీలక చర్యలు చేపడుతున్నాయి. కమ్యూనిటీలను మ్యాపింగ్ చేయడం, ఎక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాలు, వయసు మళ్లిన వారి విషయంలో ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. నిత్యం ట్యాబ్లెట్లు వాడేవారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. మెడికల్ కేర్‌ను మరింత అందుబాటులోకి తీసుకెళ్లడం, వైద్య సదుపాయాల మెరుగుపర్చడం, ఆశా, ఎఎన్ఎంలను ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో సేవలందించేలా చర్యలు తీసుకోవడం కరోనాపై పోరులో సత్ఫలితాలు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు అధికారులు. ఈ నెట్వర్క్ ఫలితంగానే కాంటాక్ట్ ట్రేసింగ్, పర్యవేక్షణ సులభమైందని అన్నారు.