ప్రపంచ దేశాలకు భారత్ దిక్చూచిగా నిలిచిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉగ్రవాదం, హింస, ద్వేషం, వివాదాల నుంచి విముక్తి పొందాలనుకునే ప్రపంచానికి.. భారతీయ జీవన విధానం ఒక ఆశాకిరణంగా కనిపిస్తోందని చెప్పారు. వివాదాలను క్రూరమైన శక్తితో కాకుండా చర్చల ద్వారా పరిష్కరించటమే భారతీయ మార్గమని స్పష్టం చేశారు.
కేరళ కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో జరిగిన 'గ్లోబలైజింగ్ ఇండియన్ థాట్' కార్యక్రమంలో దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు ప్రధాని మోదీ. భారతీయుల ఆవిష్కరణ శక్తి ప్రపంచాన్ని దేశం వైపు ఆకర్షిస్తోందని అభిప్రాయపడ్డారు.
" శతాబ్దాలుగా మన భూభాగంలోకి ప్రపంచ దేశాలను ఆహ్వానించాం. చాలా నాగరికతలు చరిత్రలో కలిసిపోయిన సందర్భంలో భారత నాగరికత అభివృద్ధి చెందింది. ఎందుకు? దేశంలోని శాంతి సామరస్యమే దానికి కారణం. ద్వేషం, హింస, వివాదం, ఉగ్రవాదం నుంచి విముక్తి పొందాలని కోరుకునే ప్రపంచానికి.. భారతీయ జీవన విధానం ఆశాకిరణంగా కనిపిస్తోంది. వివాదాన్ని క్రూరమైన శక్తి ద్వారా కాకుండా..శాంతి చర్చల ద్వారా పరిష్కరించటమే భారత మార్గం."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
వివేకానందుడి విగ్రహం ఆవిష్కరణ..
కోజికోడ్ ఐఐఎంలోని ఎండీసీ భవనం ముందు ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు ప్రధాని మోదీ.
ఇదీ చూడండి: 'పౌర' చట్టానికి ప్రజలు మద్దతుగా నిలవాలి: షా