పత్రికల ముద్రణకు ఉపయోగించే న్యూస్‌ప్రింట్ ధర గత మూడు నెలల్లో 20 శాతం పెరిగిందని ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్‌ఎస్) పేర్కొంది. కరోనా నేపథ్యంలో డిమాండ్-సరఫరా సమతౌల్యంలో వచ్చిన మార్పులే ఇందుకు కారణమని తెలిపింది. నెల రోజుల్లో ఈ ధర మరో 10-15 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో న్యూస్‌ప్రింట్‌పై విధిస్తున్న 5 శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. త్వరలో కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఒక వినతి పత్రాన్ని ఐఎన్‌ఎస్ సమర్పించింది.
తగ్గిన సర్క్యులేషన్..
న్యూస్‌ప్రింట్ దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడంతోపాటు పరిశ్రమకు ఒక ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వాలని ఐఎన్‌ఎస్ కోరింది. కనీస టారిఫ్‌ను 50 శాతం మేర పెంచి ప్రకటనలు ఇవ్వడం ద్వారానైనా ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆర్‌ఎన్‌ఐ సర్క్యులేషన్ ధ్రువీకరణ పత్రాల చెల్లుబాటును 2022 మార్చి 31 వరకూ కొనసాగించాలని కోరింది. తద్వారా కేంద్రంలోని ప్రకటనలు, దృశ్య మాధ్యమ ప్రచార విభాగం (డీఏవీపీ) టారిఫ్‌లు వచ్చే ఏడాది వరకూ ఇదే రీతిలో కొనసాగడానికి వీలవుతుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల నుంచి కోలుకోవడానికి ప్రింట్ మీడియాకు 2-3 ఏళ్లు పట్టొచ్చని వివరించింది.
ఉద్దీపన ప్యాకేజీతో మేలు..
కొవిడ్-19 కారణంగా ఉత్పన్నమైన పరిస్థితుల వల్ల పత్రికా పరిశ్రమ బాగా దెబ్బతిందని ఐఎన్‌ఎస్ అధ్యక్షుడు ఎల్. ఆదిమూలం పేర్కొన్నారు. అనేక సంస్థలు.. 50 కన్నా తక్కువ కాపీలు వెళ్లే గ్రామీణ ప్రాంతాలకు పత్రికలను పంపడంలేదని చెప్పారు. పంపిణీ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఇలా చేశాయన్నారు. కొన్ని ఎడిషన్లను మూసేయడం, పేజీలను తగ్గించడం వంటివి కూడా చేశాయని చెప్పారు. ఈ రంగంలో అనేక మంది ఉద్యోగాలనూ కోల్పోయారన్నారు. కొన్ని చిన్న పత్రికలు మూతపడ్డాయని తెలిపారు. ''ఉద్దీపన ప్యాకేజీలతో కొన్ని పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకుంటోంది. మేం కూడా అలాంటి ప్యాకేజీని కోరుతున్నాం'' అని 'పీటీఐ' వార్తా సంస్థతో ఆదిమూలం అన్నారు.
ఇదీ చదవండి: భారత అంకుర సంస్థలకు సదావకాశం 'ప్రారంభ్'