కరోనా వ్యాక్సిన్ తొలిదశ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. తొలిదశలో దేశంలోని 23 శాతం జనాభాకు కరోనా టీకా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు సైతం వ్యాక్సిన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వీరిలో అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాక్సిన్ల ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన వ్యాక్సిన్ క్యాండిడేట్లు క్లినికల్ ప్రయోగాల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఎవరికి ముందు ఇవ్వాలన్న దానిపై కేంద్ర కసరత్తు మొదలు పెట్టినట్లు ఓ ఆంగ్లపత్రిక పేర్కొంది.
వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి? అన్న విషయంలో నాలుగు కేటగిరిలు చేశారు. ఇందులో 50-70 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, 2కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్స్(పోలీస్, మున్సిపల్, సైనిక బలగాలు) 50 ఏళ్ల వయసు దాటిన 26 కోట్లమంది కాగా, నాలుగో కేటగిరిలో 50 ఏళ్లు కన్నా తక్కువ వయసు వారిని చేర్చారు.
ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరాయి. పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ కూడా ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన పూర్తి నివేదికలు నవంబరు చివరికి లేదా డిసెంబరు మొదటి వారంలో వస్తాయని ఇటీవల కేంద్రం తెలిపింది. ఇందులో భాగంగానే కేంద్రం వ్యాక్సిన్ తొలిదశ పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేస్తోంది.