'థర్టీ మీటర్ టెలిస్కోప్(టీఎమ్‌టీ)' ప్రాజెక్టులో భాగంగా నోబెల్ గ్రహీత ఆండ్రియా గెజ్‌తో కలిసి భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు పనిచేశారు. హవాయి ద్వీపంలోని మౌనా కియాలో ఏర్పాటు చేయనున్న ఈ భారీ టెలిస్కోప్‌నకు సంబంధించిన అంతర్గత పరికరాల రూపకల్పన, శాస్త్ర సంబంధ అంశాల్లో ఆమెతో కలిసి వారు పరిశోధనల్లో పాల్గొన్నారని శాస్త్ర, సాంకేతిక శాఖ(డీఎస్‌టీ) వెల్లడించింది. ఆండ్రియా బృందంలో 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్(ఐఐఏ)' డైరెక్టర్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం, 'ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్' శాస్త్రవేత్త శశిభూషణ్ పాండే తదితరులున్నారు.
విశ్వంలోని నిగూఢ రహస్యాలను అర్థంచేసుకోవడంలో టీఎమ్‌టీ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి శాస్త్రీయ అంశాలు, యంత్రపరికరాల రూపకల్పనతో పాటు ఆ టెలిస్కోప్‌నకు అవసరమైన కాంతిశాస్త్ర అంశాల్లో అధ్యయనం చేసిన బృందంలో ఆండ్రియా కీలకంగా వ్యవహరించారు. ఖగోళ, భౌతికశాస్త్రాల్లో తలెత్తే కొత్త ప్రశ్నలకు సమాధానం కనుగొనడంలో ఈ టెలిస్కోపు కీలకంగా పనిచేస్తుందని డీఎస్‌టీ అభిప్రాయపడింది.
ఇదీ చూడండి: 'మోదీ మంత్ర'తో బిహార్లో ఎన్డీఏ జోరు