భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దులో చైనాకు దీటుగా బలగాలను మోహరిస్తోంది భారత్. తూర్పు లద్దాఖ్ సహా సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధతను పెంచింది భారత వైమానిక దళం. చైనా సరిహద్దులోని వైమానిక స్థావరం వద్ద భారీగా యుద్ధ విమానాలను దించింది వాయుసేన. సుఖోయ్-10ఎంకేఐ, మిగ్-29ఎస్, అపాచీ యుద్ధ విమానాలు ఆకాశంలో చక్కర్లు కొడుతూ గస్తీ కాస్తున్నాయి.
చైనా సరిహద్దులోని వైమానిక స్థావరంలో రవాణా విమానంతో పాటు అమెరికన్ సీ-17, సీ-130జే, ఐల్యూషిన్-76, ఆంటోనోవ్-32 వంటివి కనిపించాయి. దూర ప్రాంతాల్లోని సైనికులు, యుద్ధ సామగ్రిని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఫార్వర్డ్ పోస్ట్‌లకు తీసుకొచ్చేందుకు వీటిని వినియోగిస్తున్నారు.
![Indian Air Force geared up for combat role in China border area](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7896067_airforce3.jpg)
ఇండో-చైనా సరిహద్దులోని వైమానిక స్థావరం కీలక భూమిక పోషిస్తుందని తెలిపారు ఓ ఐఏఎఫ్ వింగ్ కమాండర్.
"ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత వైమానిక దళం సిద్ధంగా ఉంది. అన్ని అంశాల్లోనూ వైమానిక బలం చాలా శక్తిమంతమైంది. యుద్ధంలో, అన్ని రకాల మిలిటరీ కార్యకలాపాలకు మద్దతుగా నిలిచే పాత్రలో వైమానిక శక్తి ప్రధాన భూమిక పోషిస్తుంది. అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇప్పటికే సిబ్బంది, సామగ్రి వంటివి సమకూర్చుకున్నాం."
- వింగ్ కమాండర్, వైమానిక దళం.
ఫార్వర్డ్ ప్రాంతాలకు ఆర్మీ, ఐటీబీపీ బలగాలను తరలించేందుకు చినూక్, ఎంఐ-17 వీ5 హెలికాఫ్టర్లను రంగంలోకి దించారు అధికారులు. పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తూ.. చైనాకు గట్టి హెచ్చరికలు పంపుతున్నారు.
![Indian Air Force geared up for combat role in China border area](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7896067_airforce2.jpg)
![Indian Air Force geared up for combat role in China border area](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7896067_airforce.png)
ఇదీ చూడండి: చైనాతో వివాదంలో భారత్‌కు అండగా అగ్రదేశాలు