అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పాకిస్థాన్ చేసిన విమర్శలపై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ విషయంతో పొరుగు దేశానికి ఎలాంటి సంబంధం, అర్హత లేదని ఘాటుగా బదులిచ్చారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ.
"పాక్ చేసిన అసంబద్ధ ప్రకటనను చూశాం. ఈ విషయంలో జోక్యం చేసుకునే అర్హత ఆ దేశానికి లేదు. ఆ దేశ చరిత్ర చూస్తే.. మైనారిటీల గురించి మాట్లాడటానికి కూడా పాక్ సంకోచించాలి. న్యాయవ్యవస్థ పరంగా చూసినా పాక్కు కృతజ్ఞతా భావం లేదు. నిజాయతీ, విశ్వసనీయత ఉన్నవారిని గుర్తించలేదు.
భారత్లో చట్ట ప్రకారం పాలన జరుగుతోంది. ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం సమాన హక్కులు ఇచ్చింది. ఈ తేడాను తెలుసుకోవాలంటే పాక్ విదేశాంగ శాఖ తమ సొంత రాజ్యాంగాన్ని చదివితే సరిపోతుంది."
- అనురాగ్ శ్రీవాత్సవ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
ప్రపంచం మొత్తం కరోనాపై పోరాడుతుంటే ఆర్ఎస్ఎస్-భాజపా సంయుక్తంగా హిందుత్వ అజెండాను విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పుకొచ్చింది పాక్. రామమందిర నిర్మాణం ఈ అజెండాలో మరో ముందడుగని.. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికలను ప్రస్తావిస్తూ మొసలి కన్నీరు కార్చింది.
బుద్ధి మార్చుకోని పాక్..
సున్నితమైన ఈ అంశంపై పాక్ ఎప్పటి నుంచో విషం చిమ్ముతోంది. సుప్రీం నిర్ణయంపైనా విమర్శలు చేసింది. పాక్ ఆరోపణలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. అయోధ్య రామ మందిరం, పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక వంటి అంశాలన్నీ పూర్తిగా భారత అంతర్గత వ్యవహారాలని స్పష్టం చేసింది. అయినా దుర్బుద్ధి మార్చుకోని పాక్ అనవసర రాద్ధాంతం చేయాలని చూస్తోంది.
ఇదీ చూడండి: రామ మందిర నిర్మాణంపై విషం చిమ్మిన పాక్