మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. వైరస్ కేంద్రబిందువు వుహాన్‌లో ఉన్న దాదాపు 250 మంది భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గాబా అధ్యక్షతన సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
చైనాతో చర్చలు...
వైరస్ గడగడలాడిస్తున్న నేపథ్యంలో వుహాన్ నగరంలో కార్యకలాపాలన్నీ మూసివేశారు అధికారులు. ఫలితంగా అక్కడ నివసించే వారు ఇతర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వుహాన్, హుబెయ్లో ఉన్న 250 మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు. ప్రస్తుతం వారందరినీ భారత్‌కు తీసుకువచ్చేలా చైనాతో చర్చలు జరుపుతోంది భారత ప్రభుత్వం. ఈ మేరకు బీజింగ్‌లోని భారత్ రాయబారులు అక్కడి యంత్రాంగంతో చర్చలు జరిపారు. అనంతరం భారతీయులను తరలించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
కేరళవారే అధికం
ఇప్పటి వరకు చైనా నుంచి భారత్‌కు వచ్చిన 155 విమానాల్లోని 33వేల 552 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వైద్యపరిశీనలలో 450 మంది ఉన్నారు. ఇందులో అధిక శాతం కేరళకు చెందిన వారే. అయితే ఇప్పటివరకు వీరిరి కరోనా వైరస్ సోకినట్లు ఒక్క కేసు కూడా నిర్ధరించలేదు.
ముంబయిలో అనుమానం
జనవరి 18నుంచి ముంబయి అంతర్జాతీయ విమానాశ్రమానికి చైనా నుంచి 3756 ప్రయాణికులు చేరుకున్నారు. వీరిలో ఐదుగురికి దగ్గు, జ్వరం వంటి లక్షణాలను గుర్తించి.. వారిలో ఇద్దరికి వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి : కరోనా కలకలం: వుహాన్‌లో మనోళ్లు సురక్షితమేనా?