దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించారు ప్రధాని నరేంద్రమోదీ. అయితే లాక్‌డౌన్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా సోమవారం నుంచి కొన్ని రంగాలకు సడలింపులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని రంగాలకు మినహాయింపులు ఇవ్వాలని స్పష్టమైన మార్గదర్శకాలను ఏప్రిల్ 15న విడుదల చేసింది. భౌతిక దూరం నిబంధనను కఠినంగా అమలు చేస్తూనే ఈ సడలింపులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది కేంద్రం.
అయితే పలు రాష్ట్రాలు సడలింపులు ఇచ్చేందుకు సంకోచిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి తగ్గకపోవటం వల్ల మినహాయింపులపై వెనకడుగు వేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు తమ పరిస్థితుల ఆధారంగా సడలింపులను అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి.
దిల్లీలో మినహాయింపులు లేవు..
దేశ రాజధానిలో కరోనా వ్యాప్తి రోజురోజకు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 20 తర్వాత ఇవ్వాల్సిన మినహాయింపులు దిల్లీలో ఉండవని స్పష్టం చేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. లాక్డౌన్ యథాతథంగా కొనసాగుతుందని తేల్చిచెప్పారు. వారం తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
పంజాబ్‌లో కూడా..
పంజాబ్ రాష్ట్రంలో మే 3వ తేదీ వరకు లాక్డౌన్ సడలింపులు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం అమరీందర్ యంత్రాంగాన్ని ఆదేశించారు.
తెలంగాణలోనూ ఎలాంటి సడలింపులు ఉండవని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మహాలో ఆర్థిక అంశాలకు..
కరోనా ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్రలో కేవలం ఆర్థిక కార్యకలాపాలకే అనుమతి ఇస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని పరిశ్రమలను తెరిచేందుకు కొన్ని నిబంధనలతో అంగీకరించారు ఠాక్రే.
- కార్మికులకు వసతి, భోజనం కల్పిస్తూ భౌతిక దూరాన్ని అమలు చేయాలని యజమానులకు ఠాక్రే స్పష్టం చేశారు.
- జిల్లా సరిహద్దులు యథాతథంగా మూసి ఉంటాయన్నారు. అత్యవసర వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు, పరికరాల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండవని పేర్కొన్నారు.
- వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతి లేదని, వారి పూర్తి బాధ్యత రాష్ట్రానిదేనని ఠాక్రే స్పష్టం చేశారు.
రాజస్థాన్‌లోనూ..
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు అనుమతి ఇచ్చింది రాజస్థాన్. పుర, నగర పాలికల పరిధిలో కాకుండా గ్రామీణ ప్రాంతాలు, సెజ్‌ల్లో ఉన్న పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించవచ్చని తెలిపింది.
కార్మికులకు వసతి, భోజన సదుపాయం పరిశ్రమ ప్రాంగణంలోనే కల్పించాలని నిబంధన విధించింది. వాహనాల రాకపోకలకు పాస్ పద్ధతిని ప్రవేశపెట్టింది.
తమిళనాట..
సడలింపులపై తమిళనాడు ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఆంక్షల మినహాయింపుపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
కేరళ మూడు జోన్ల విధానంతో..
రాష్ట్రాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది కేరళ. ఆరెంజ్-బీ జోన్‌లో సోమవారం, జోన్-ఏలో ఏప్రిల్ 24 నుంచి ఈ సడలింపులు అమల్లోకి వస్తాయి. ఈ జోన్లలో రాత్రి 7 వరకూ రెస్టారెంట్లు, ప్రైవేటు వాహనాలను అనుమతి ఉంటుంది. వాహనాలను సరి బేసి విధానం ద్వారా అనుమతులు ఇస్తారు.
అయితే అన్ని ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. గ్రీన్ జోన్లలో కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలు సడలించనున్నారు. రెడ్ జోన్‌లో యథాతథంగా లాక్డౌన్ కొనసాగుతుంది.
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో..
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం నుంచి ఉప కార్యదర్శి నుంచి ఆ పై స్థాయి అధికారులు అందరూ హాజరవుతారు. మిగతా అధికారులు, సిబ్బందిలో 33 శాతం మంది విధులకు వస్తారు. వీరంతా షిఫ్టుల వారీగా పనిచేస్తారు.
ఈ మేరకు పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభ సచివాలయ కార్యకలాపాలు కూడా సోమవారం నుంచి ప్రారంభమవుతాయి.
పరిస్థితిని బట్టి మరిన్ని సడలింపులు..
కేంద్రం ఇస్తున్న సడలింపులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని ఐటీ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. దేశంలో కరోనా ప్రభావాన్ని ఇదే స్థాయిలో నియంత్రించగలిగితే క్రమంగా పట్టణ ప్రాంతాల్లోనూ కార్యకలాపాలు పునప్రారంభమవుతాయని అన్నారు.
ఇదీ చూడండి: 'ఇల్లే కార్యాలయం.. ఇంటర్నెట్ కొత్త సమావేశ మందిరం'