అరుణాచల్‌ప్రదేశ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు చైనా అభ్యంతరంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశంలో అంతర్భాగమైన రాష్ట్రంలో నాయకులు పర్యటిస్తే అభ్యంతరం తెలపడం సహేతుకం కాదంటూ డ్రాగన్‌పై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మండిపడ్డారు. అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని, విడదీయరానిదని చైనాకు ఆయన స్పష్టం చేశారు.
వేడుకల్లో భాగంగా పర్యటన!
అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడ పర్యటించడంపై డ్రాగన్ అభ్యంతరం తెలిపింది. షా పర్యటన తమ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని చైనా విదేశాంగ శాఖ గురువారం వ్యాఖ్యానించింది. అరుణాచల్‌ప్రదేశ్ ప్రజలు అమిత్ షా పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. సరిహద్దు సమస్యను మరింత జటిలం చేసే చర్యలను ఆపాలంది. సరిహద్దు ప్రాంతంలో శాంతి, సామరస్యతను నెలకొల్పేందుకు భారత్ చర్యలు తీసుకోవాలని సూచించింది. అరుణాచల్ ప్రదేశ్ తమ అధీనంలోని టిబెట్‌లో భాగమంటూ చైనా ఆది నుంచీ వాదిస్తోంది.
ఇదీ చూడండి: 'ట్రంప్ అందుకే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు'