పాకిస్థాన్లోని పవిత్ర నంకనా సాహిబ్ గురుద్వారా వద్ద జరిగిన విధ్వంసాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. స్థానిక సిక్కుల భద్రత కోసం తక్షణం చర్యలు తీసుకోవాలని దాయాదికి సూచించింది.
పాకిస్థాన్లోని నంకనా సాహిబ్.. సిక్కుల గురువైన నానక్ దేవ్ జన్మస్థలం. ఈ పవిత్ర స్థలంలో మైనారిటీలైన సిక్కులపై మతపరమైన దౌర్జన్యాలు జరుగుతున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
"పవిత్ర నంకనా సాహిబ్ వద్ద విధ్వంసం సృష్టించడం, మైనారిటీ సిక్కులను వేధించడాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. పవిత్ర గురుద్వారాను అపవిత్రం చేసి, మైనారిటీ సిక్కు వర్గానికి చెందిన ప్రజలపై దాడిచేసిన దుండగులపై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలి."- భారత విదేశాంగ మంత్రిత్వశాఖ
గతేడాది ఆగస్టులో ఓ సిక్కు బాలికను ఇంటి నుంచి అపహరించి, బలవంతంగా మతమార్పిడి చేయించిన ఘటన పాకిస్థాన్లో జరిగింది. మళ్లీ ఇప్పుడు సిక్కులపై దాడులు జరుగుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం.... కొందరు స్థానికులు శుక్రవారం సిక్కు యాత్రికులపై దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఇదీ చూడండి: ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ భారత పర్యటన రద్దు