ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ తీరును భారత్ మరోసారి ఎండగట్టింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 43వ సమావేశంలో కశ్మీర్ అంశాన్ని పాక్ మరోసారి లేవనెత్తగా... భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. భారత్‌కు ఉచిత సలహాలు ఇచ్చే ముందు తమ దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై పాక్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని భారత ప్రతినిధి సెంథిల్ కుమార్ హితవు పలికారు.
హింసను అరికట్టడానికే..
శాంతి, అభివృద్ధి, సమాజ శ్రేయస్సు కోసమే జమ్ముకశ్మీర్‌లో 370 అధికరణను ఉపసంహరించామని ఆయన స్పష్టం చేశారు. మానవ హక్కుల మండలి వేదికను పాక్ దుర్వినియోగం చేసిందన్నారు సెంథిల్. పాకిస్థాన్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ధ్వజమెత్తారు. దైవ దూషణ చట్టాలను దుర్వినియోగం చేస్తూ పాక్ మైనారిటీలను భయబ్రాంతులకు గురిచేస్తోందని వివరించారు.
పాక్‌లో హింస కారణంగా 2015 నుంచి ఇప్పటివరకు 65 మంది ట్రాన్స్జెండర్లు మరణించారని తెలిపారు. బలోచిస్థాన్‌లో కిడ్నాప్‌లు, హింస, వేధింపులు, హత్యలు, నిర్భంధ కేంద్రాలు, సైనిక కార్యకలాపాలు నిత్య కృత్యమని.. దీనిపై పాకిస్థాన్ స్పందించాలని భారత్ డిమాండ్ చేసింది.
ఇదీ చూడండి: కొవిడ్ ఆస్పత్రుల తనిఖీలకు కేంద్ర బృందాలు