ఇస్లామాబాద్‌తో భారత ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల పాక్ మీడియా కథనం పేర్కొంది. అయితే.. ఈ వార్తలను ఖండించింది భారత విదేశాంగ శాఖ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్... పాక్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్.
'ఇస్లామాబాద్‌తో సన్నిహత సంబంధాల కోసం దిల్లీ చర్చలకు సిద్ధంగా ఉంది' అని భారత ప్రధాని, విదేశాంగ మంత్రి స్పందించినట్లు పాక్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ మీడియా కథనం పేర్కొంది.
ప్రధాని మోదీ, జైశంకర్... పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ విదేశాంగ మంత్రి షా మెహ్మూద్ ఖురేషీల మధ్య అభినందనల సందేశాల్లో చర్చల ప్రస్తావన రాలేదని స్పష్టం చేశారు రవీశ్ కుమార్. నమ్మకమైన, ఉగ్రవాద రహిత వాతావరణాన్ని కల్పించాలని మోదీ సందేశంలో నొక్కిచెప్పినట్లు తెలిపారు.
''దౌత్య సంప్రదాయాలను అనుసరించి పాక్ ప్రధాని ఇమ్రాన్, విదేశాంగ మంత్రి ఖురేషీ అభినందన సందేశాలకు మోదీ, విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రతిస్పందించారు. వారి సందేశాలకు బదులిస్తూ పాకిస్థాన్‌తో సహా పొరుగు దేశాలన్నింటితోనూ భారత్ సాధారణ, సహకార సంబంధాల్ని కోరుకుంటోందని తెలిపారు.కానీ.. సందేశాల్లో చర్చల ప్రస్తావన రాలేదు.''
-రవీశ్ కుమార్, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో రెండు రోజుల పాటు ఎస్సీఓ సదస్సు జరిగింది. పాక్ ప్రధాని సహా సభ్య దేశాల అధినేతలు హాజరయ్యారు. ప్రధానిగా తిరిగి ఎన్నికైనందుకు మోదీకి ఇమ్రాన్ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ, ఇమ్రాన్ మధ్య సరదా సంభాషణ జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.