దక్షిణాసియా స్పీకర్ల సదస్సు మాల్దీవుల్లో జరుగుతుంది. ఈ సమావేశం వేదికగా భారత్-పాక్ మధ్య మాటల యుద్ధం జరిగింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు అంశాన్ని దాయాది దేశం లేవనెత్తడం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య వాడీ వేడీ వాదనకు దారి తీసింది.
సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా... మన రాజ్యసభ ఉపసభాపతి హరివంశ్ వెంటనే దీటుగా బదులిచ్చారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తారు.
''భారత అంతర్గత విషయాన్ని ఇక్కడ లేవనెత్తడంపై మేం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఈ సదస్సు ప్రాధాన్యాంశాల్లో భాగం కాని సమస్యలను తీసుకురావడం... సమావేశాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సరిహద్దులో ఉగ్రవాదాన్ని పాక్ నిలిపివేయాలి. శాంతి నెలకొనాలంటే ఉగ్రకార్యకలాపాలను ప్రోత్సహించడం పాక్ ఆపాలి.
- హరివంశ్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్
దక్షిణాసియా స్పీకర్ల సదస్సులో భారత ప్రతినిధుల బృందానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వం వహించారు.
కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికల్లో లేవనెత్తాలని పాక్ శతవిధాలా ప్రయత్నిస్తోంది.
కశ్మీర్ అంశం తమ అంతర్గతమని, ఎవరి జోక్యం అవసరం లేదని భారత్ తేల్చిచెప్పింది.
ఇదీ చూడండి: ఎన్ఆర్సీలో లేకున్నా వారినలా చూడొద్దు: ఐరాస