వాయు కాలుష్యం భారత్‌కు కలిగిస్తున్న పెను నష్టాన్ని తాజా నివేదిక ఒకటి కళ్లకు కట్టింది. జీడీపీలో 1.4 శాతాన్ని.. అంటే అక్షరాలా రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలను ఈ కాలుష్యం కారణంగా గత ఏడాది మన దేశం నష్టపోయిందని వెల్లడించింది. 2019లో దేశవ్యాప్తంగా 17 లక్షల మంది మరణాలకు ఈ భూతమే కారణమనీ తెలిపింది.
గత మూడు దశాబ్దాల్లో గృహ సంబంధిత కాలుష్యం తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే విషయమే అయినా.. అదే సమయంలో బహిరంగా కాలుష్యం పెరగడం ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొంది. ‘ఇండియా - స్టేట్ లెవల్ డిసీజ్ బర్డన్ ఇనిషియేటివ్’ పేరుతో ఈ అధ్యయన నివేదిక ‘లాన్సెట్ ప్లానెటరీ హెల్త్’ జర్నల్‌లో మంగళవారం ప్రచురితమైంది. దేశ ఆర్థిక, వైద్య ఆరోగ్య రంగాలపై వాయు కాలుష్యం చూపుతున్న ప్రభావాన్ని అందులో విశ్లేషించారు. తాజా నివేదికలోని వివరాల ప్రకారం..
మరణాల్లో 18 శాతం
గత ఏడాది వాయు కాలుష్య ప్రభావం కారణంగా భారత్‌లో 17 లక్షల మంది ప్రాణాలు విడిచారు. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న మొత్తం మరణాల్లో ఆ సంఖ్య 18 శాతంగా ఉంది. గృహ సంబంధిత కాలుష్యం భారత్‌లో గణనీయంగా తగ్గింది. ఈ కాలుష్యం కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య 1990తో పోలిస్తే 64 శాతం తగ్గింది. అయితే- గృహాల నుంచి వెలువడే కాలుష్యం కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఇప్పటికీ అధికంగానే ఉంటోంది. గత ఏడాది 6.1 లక్షల మంది ప్రాణాలను అది మింగేసింది. దేశంలో బహిరంగ వాయు కాలుష్యం 115% మేర, ఓజోన్ కాలుష్యం 139.2% మేర పెరిగింది.
ఉత్తర్ ప్రదేశ్‌కు అత్యధిక నష్టం
గాలి కాలుష్యం కారణంగా సంభవిస్తున్న మరణాలు, చుట్టుముట్టిన అనారోగ్య సమస్యల కారణంగా 2019లో అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ తన జీడీపీలో 2.2 శాతాన్ని నష్టపోయింది. తర్వాతి స్థానంలో బిహార్ (2%) ఉంది. తలసరి ఆర్థిక నష్టం ప్రాతిపదికన చూస్తే.. దిల్లీ అన్నింటికంటే ఎక్కువ నష్టాన్ని చవిచూసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ కూడా భారీగానే మూల్యం చెల్లించుకున్నాయి.
ఉత్తరాదిలో ప్రమాద ఘంటికలు
దేశంలో ప్రతి ఘనపు మీటరు గాలిలో సగటున 91.7 మైక్రోగ్రాముల ధూళి రేణువులు ఉంటున్నాయి. వీటి పరిమాణం కేరళలో 15.8 మైక్రోగ్రాములకు పరిమితమైతే దిల్లీలో 217.6 మైక్రోగ్రాముల వరకూ ఉంటోంది. కేరళతో పోలిస్తే దిల్లీలో కాలుష్యం 13.8 రెట్లు అధికంగా ఉంది. దాదాపుగా ఉత్తర భారత రాష్ట్రాలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. దిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రెడ్‌జోన్‌లో ఉండగా.. రాజస్థాన్, ఝార్ఖండ్ ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి. 2019లో దేశంలో 56.3% మంది ప్రజలు వంట కోసం ఘన ఇంధనం వాడగా.. ఇందులో అత్యధికులు ఈశాన్య, ఉత్తర భారత రాష్ట్రాలవారే.
మెరుగ్గా దక్షిణాది
ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మెరుగ్గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ప్రతి ఘనపు మీటరుకు ధూళి కణాలు 20-39.9 మైక్రోగ్రాముల మధ్య ఉన్నాయి. తెలంగాణలో మాత్రం కాలుష్య తీవ్రత కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ ధూళి కణాలు ప్రతి ఘనపు మీటరుకు 40 ఉంచి 59.9 మైక్రోగ్రాముల వరకు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఓజోన్ కాలుష్యం పరంగా ఆరెంజ్ జోన్‌లో చేరాయి. వంట కోసం ఘన ఇంధనం వాడే వారి సంఖ్య తమిళనాడు, తెలంగాణల్లో 30% లోపు ఉండగా, ఏపీలో 30-39.9% వరకు ఉంది. కర్ణాటక, కేరళల్లో ఇలాంటి వారి సంఖ్య 30-49.9% వరకు ఉంది. గత ఏడాది వాయు కాలుష్యం కారణంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తమ జీడీపీల్లో 1% నుంచి 1.24% వరకు నష్టపోయాయి. తెలంగాణ, కేరళల్లో ఈ నష్టం 0.75% నుంచి 0.99% వరకే ఉంది.
ఇదీ చదవండి : పీల్చే గాలే శత్రువు... కాలుష్యమే ప్రాణాంతకం