దేశంలో పేదరికం స్థాయి తగ్గుతోందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2006-16 మధ్య కాలంలో 27.1 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఓ నివేదికలో తెలిపింది.
ప్రపంచ బహుముఖ పేదరిక సూచీ (ఎంపీఐ)-2019 జాబితాను 'ఐరాస అభివృద్ధి కార్యక్రమం', 'ద ఆక్స్ఫర్డ్ పేదరికం, మానవాభివృద్ధి సంస్థ' సంయుక్తంగా విడుదల చేశాయి.
101 దేశాల్లో సర్వే చేసిన ఈ సంస్థలు.. ఆదాయంతోపాటు ఆరోగ్యం, ఉద్యోగ పరిస్థితులు, హింస తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నాయి. 31 తక్కువ, 68 మధ్య, 2 ఉన్నత ఆదాయ దేశాలు న్నాయని నివేదిక వెల్లడించింది. 130 కోట్ల మంది పేదరికంతో బాధపడుతున్నారని తెలిపింది. ఇందులో అధికం భాగం పిల్లలేనని నివేదిక స్పష్టం చేసింది.
పది దేశాల్లో తగ్గుదల
భారత్తో పాటు మొత్తం పది దేశాల్లో పేదరికం తగ్గింది. బంగ్లాదేశ్, కంబోడియా, కాంగో, ఇథియోపియా, హైతీ, నైజీరియా, పాకిస్థాన్, పెరూ, వియత్నాం తదితర దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో దక్షిణాసియా దేశాలే అధికం.
భారత్లో మరింత వేగంగా..
ఈ దశాబ్ద కాలంలో బహు ముఖ పేదరిక సూచీ భారత్, కంబోడియాలో వేగంగా క్షీణించింది. 2006-16 మధ్య కాలంలో ఎంపీఐ విలువ 0.283 నుంచి 0.123కి చేరింది. ఇందుకు కారణం ఆస్తులు, వంట సామగ్రి, పారిశుద్ధ్యం, పోషకాహారం తదితర అంశాల్లో వేగంగా అభివృద్ధి చెందటమేనని స్పష్టం చేసింది ఐరాస. ఇథియోపియా, పెరూ, భారత్ అన్ని అంశాల్లోనూ అధిక పురోగతి నమోదు చేశాయి.
దేశంలో 2005-06లో ఎంపీఐ ప్రకారం 64 కోట్ల (55.1 శాతం) మంది పేదవారు ఉన్నారు. ప్రస్తుతం ఇది 36.9 కోట్ల (27.9 శాతం)కు తగ్గింది.
అంశాల వారీగా...
అంశాలు | 2005-06 | 2015-16 |
పోషకాహార లేమి | 44.3 | 21.2 |
శిశు మరణాలు | 4.5 | 2.2 |
వంట ఇంధన లేమి | 52.9 | 26.2 |
పారిశుద్ధ్య లేమి | 50.4 | 24.6 |
రక్షిత తాగు నీరు లేమి | 16.6 | 6.2 |
విద్యుత్ సౌకర్యం లేమి | 29.1 | 8.6 |
ఆస్తుల క్షీణత | 37.6 | 9.5 |
ఇదీ చూడండి: చెన్నై దాహం తీర్చేందుకు ప్రత్యేక రైలు