కర్తార్‌పుర్ నడవా నిర్మాణంలో సమస్యలపై భారత్-పాక్ ప్రతినిధుల చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. భారత విదేశాంగ సంయుక్త కార్యదర్శి ఎస్సీఎల్ దాస్, పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైసల్ నేతృత్వంలో రెండు దేశాల ప్రతినిధులు అఠారీ-వాఘా సరిహద్దులో సమావేశమయ్యారు. కర్తార్‌పుర్ నడవాపై ఇరు దేశాల ప్రతినిధులు భేటీ కావటం ఇది రెండోసారి.
సమావేశంలో 80 శాతం ప్రతిపాదనలను ఇరుదేశాలు అంగీకరించినట్లు ఫైసల్ తెలిపారు. మిగిలిన అంశాలపై చర్చించేందుకు మరోసారి భేటీ అయ్యే అవసరం ఉందన్నారు. భారత్ లేవనెత్తిన అంశాలకు పాక్ సానుకూలంగా స్పందించిందని మన విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.
"వీసా లేని ప్రయాణానికి అంగీకారం కుదిరింది. మొదటగా రోజుకు 5వేల మంది ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. ఈ సంఖ్య భవిష్యత్తులో తప్పక పెరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం... 365 రోజులు రాకపోకలు ఉంటాయి. మేము చర్చించిన అంశాల్లో భద్రత అతి ముఖ్యమైనది. యాత్రికులకు సరైన భద్రత కల్పించేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి."
-ఎస్సీఎల్ దాస్, విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి
నిర్మాణం, కమిటీలు, యాత్రికులకు సంబంధించిన అనేక అంశాల్లో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.
- కర్తార్‌పుర్ వరకు భారత్ నుంచి 4 వరుసల రహదారి, పాక్ నుంచి 2 వరుసల మార్గం నిర్మాణం
- భారత్‌లో నిర్మించే వంతెనను అనుసంధానించేలా పాక్ నిర్మాణం చేపట్టాలి
- భారత్ పాస్‌పోర్టు ఉన్నవారు, జాతీయత కలిగిన వారికి వీసా లేని ప్రయాణం
- ప్రత్యేక సందర్భాల్లో రోజుకు 10 వేల యాత్రికులకు అనుమతి
- గురునానక్ 550 జయంతి (నవంబర్ 12) నాటికి పనుల పూర్తి
- నడవాలో భారత్ వ్యతిరేక చర్యలు పూర్తిగా నిషిద్ధం
చావ్లాపై వేటు
పాకిస్థాన్ సిక్కు గురుద్వార ప్రబంధక్ కమిటీలో ఖలిస్థానీ వేర్పాటువాది గోపాల్ సింగ్ చావ్లా ఉండడంపై భారత్ అభ్యంతరం లేవనెత్తగా దాయాది దేశం తలొగ్గింది. ప్రతినిధుల బృందం నుంచి అతడ్ని తప్పించింది.
ప్రముఖ గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సిక్కు యాత్రికులు దర్శించేందుకు భారత్‌లోని గురుదాస్‌పుర్ నుంచి కర్తార్‌పుర్ వరకు నడవా నిర్మించేందుకు గత నవంబర్‌లో రెండు దేశాలు అంగీకరించాయి. గురుదాస్‌పుర్ నుంచి సరిహద్దు వరకు భారత్, సరిహద్దు నుంచి కర్తార్‌పుర్ వరకు పాకిస్థాన్ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటాయి.
ఇదీ చూడండి: కర్తార్‌పుర్ నడవాపై భారత్-పాక్ చర్చలు