సరిహద్దు వివాదాన్ని సైనిక, దౌత్య మార్గాల్లో పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్-చైనాలకు చెందిన ఉన్నత స్థాయి సైనికాధికారులు నిర్ణయించారు. లద్దాఖ్ సమీప వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే విషయమై శనివారం ఇరు దేశాలకు చెందిన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు భేటీ అయ్యారు. తూర్పు లద్దాఖ్‌లోని చైనా వైపు మాల్దోలో ఉన్న సరిహద్దు సిబ్బంది సమావేశ ప్రాంతంలో ఈ భేటీ జరిగింది. భారత బృందానికి లేహ్‌లో ఉన్న 14 కోర్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హరిందర్ సింగ్, చైనా బృందానికి టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ నేతృత్వం వహించారు.
సానుకూలంగా..
సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని, సమస్య పరిష్కారానికి పరస్పర సంప్రదింపులు కొనసాగించాలన్న అభిప్రాయానికి ఇరుపక్షాలు వచ్చాయని భారతసైనిక అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. విదేశీవ్యవహారాల శాఖ గానీ, సైన్యం గానీ అంతకుమించి వివరాలను వెల్లడించలేదు.
యథా పూర్వస్థితి
భారత బృందం... గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు వద్ద యథా పూర్వస్థితిని నెలకొల్పాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. అక్కడ చైనా సైనికుల భారీ మోహరింపులను వ్యతిరేకించినట్లు తెలిసింది. ఎల్‌ఏసీలోని మన దేశం వైపునున్న ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి చైనా అడ్డుకోరాదని పట్టుబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రతిష్టంభనపై శుక్రవారం రెండు దేశాల దౌత్య అధికారుల మధ్య సంప్రదింపులు జరిగాయి. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న అవగాహనకు వచ్చారు. అంతకుముందు ఇదే అంశంపై స్థానిక సైనిక కమాండర్ స్థాయిలో 12 దఫాలు, మేజర్ జనరల్ అధికారుల స్థాయిలో మూడు సార్లు చర్చలు జరిగినా ఉద్రిక్తత మాత్రం సడలలేదు.
ఇదీ చూడండి: జాతి వివక్షకు వ్యతిరేకంగా మూడు ఖండాల్లో నిరసనలు