ప్యాంగాంగ్ సరస్సు వద్ద ప్రస్తుత పరిస్థితిపై సరిహద్దులో చర్చలు కొనసాగుతున్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారత సైన్యానికి చెందిన బ్రిగేడ్ కమాండర్, చైనాకు చెందిన అదే స్థాయి అధికారితో సమావేశమైనట్లు స్పష్టం చేశాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న చుశుల్/మోల్డో ప్రాంతంలో చర్చలు సాగుతున్నట్లు వెల్లడించాయి.
అతిక్రమణకు దీటుగా జవాబు
ప్యాంగాంగ్ దక్షిణ ఒడ్డున చైనా సైన్యం అతిక్రమణకు పాల్పడే క్రమంలో భారత జవాన్లు వారి ప్రయత్నాలను వమ్ము చేశారు. ఆగస్టు 29-30 అర్ధరాత్రి సమయంలో లద్దాఖ్లోని చుశుల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యథాతథ స్థితిని మార్చేందుకు చైనా బలగాలు ప్రయత్నించాయని భారత సైన్యం తెలిపింది. వీటిని దీటుగా తిప్పికొట్టినట్లు స్పష్టం చేసింది. చర్చల ద్వారా శాంతిని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని.. అదే సమయంలో ప్రాదేశిక సమగ్రతను కాపాడటం తమ కర్తవ్యమని సైన్యం ఇప్పటికే స్పష్టం చేసింది.
ఆ తర్వాత ఇదే..
జూన్ 15 గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత చైనా దుందుడుకు చర్యల్లో ఇదే పెద్ద ఘటన అని భారత సైన్యం అభిప్రాయపడింది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించగా.. చైనా జవాన్లు కూడా పెద్ద సంఖ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్టు అమెరికా నిఘావర్గాలు వెల్లడించాయి. అయితే చైనా ఇప్పటివరకు ఆ విషయాన్ని ధ్రువీకరించలేదు. కానీ, ఇటీవలే చైనాలో ఓ జవాను సమాధిపై గల్వాన్ లోయలో చనిపోయిన అమరవీరుడంటూ మాండరిన్ భాషలో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇదీ చదవండి-సరిహద్దులో చైనా ఘర్షణ- రాజకీయ రగడ