భారత్.. శాంతిని ప్రేమించే దేశమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. దేశీయ రక్షణ సామర్థ్యాలే శాంతి సాధనకు పునాది అని భారత్ విశ్వసిస్తుందని స్పష్టం చేశారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో రాజ్‌నాథ్ వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.
త్వరలో జరగబోయే ఏరో ఇండియా ఎగ్జిబిషన్‌కు సంబంధించి విదేశీ రాయబారుల బృందంతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ప్రసంగించారు రాజ్‌నాథ్. ఈ సమావేశంలో 75 దేశాలకు చెందిన రాయబారులు, రక్షణ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.
రక్షణ రంగంలో..
కీలకమైన సైనిక సంస్థలు, ఆయుధ వ్యవస్థల ఉత్పత్తి కేంద్రంగా దేశాన్ని మార్చడానికి ప్రభుత్వం ప్రారంభించిన వివిధ సంస్కరణ చర్యలను రాజ్‌నాథ్ ప్రముఖంగా ప్రస్తావించారు. రక్షణ తయారీ రంగంలో మొదటి ఐదు దేశాల్లో ఒకటిగా నిలవడటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
నాలుగో తరం యుద్ధ విమానాలు, అణు జలాంతర్గాములు, బ్యాటిల్ ట్యాంకులు, బాలిస్టిక్ క్షిపణుల తయారు చేసే అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటని చెప్పారు రాజ్‌నాథ్.
ఇదీ చూడండి: బిహార్ బరి: ఎల్జేపీ 'గారడీ'తో ఎవరికి నష్టం?