తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణ ప్రాంతాల నుంచి 'త్వరగా, పూర్తిగా' బలగాలను ఉపసంహరించుకోవాలని భారత్, చైనాలు శుక్రవారం నిర్ణయించాయి. ద్వైపాక్షిక సంబంధాల్లో పూర్తిస్థాయి పురోగతి సాకారం కావాలంటే సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాయి. సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయ కార్యాచరణ యంత్రాంగం (డబ్ల్యూఎంసీసీ) కింద రెండు దేశాలు శుక్రవారం ఆన్‌లైన్ ద్వారా దౌత్య సమావేశాలను నిర్వహించాయి. ఈ నెల 14న కోర్ కమాండర్ స్థాయిలో సైనిక సమావేశాలకు కొనసాగింపుగా ఈ భేటీ జరిగింది. వాస్తవాధీన రేఖ వెంబడి కొన్ని ప్రాంతాల్లో తన బలగాలను చైనా వెనక్కి తీసుకోవడంలేదంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో జరుగుతున్న ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది.
భారత బృందానికి విదేశాంగ శాఖలో సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ, చైనా బృందానికి సరిహద్దు, సముద్ర వ్యవహారాల విభాగం డైరెక్టర్ జనరల్ హాంగ్ లియాంగ్‌లు నేతృత్వం వహించారు. ఇరు దేశాల సైనిక కమాండర్ల చర్చల్లో కుదిరిన ఒప్పందం మేరకు చైనా తన బలగాలను ఉపసంహరించాల్సిందేనని ఈ భేటీలో భారత్ గట్టిగా స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సైన్యాలను వేగంగా వెనక్కి తీసుకోవడానికి అవసరమైన తదుపరి చర్యల ఖరారుకు త్వరలోనే మరోసారి సైనిక సమావేశాలను నిర్వహించాలని తాజా భేటీలో నిర్ణయించినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 5న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీలు నిర్వహించిన టెలిఫోన్ చర్చల్లో నిర్ణయించిన అంశాల ప్రాతిపదికన నడుచుకోవాలని తీర్మానించినట్లు వివరించింది. సైనిక కమాండర్ల భేటీలో నిర్ణయించిన అంశాలను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇరుపక్షాలూ అభిప్రాయపడినట్లు తెలిపింది. బలగాల ఉపసంహరణ విషయంలో జరిగిన సానుకూల పురోగతిపై ఇరు దేశాలూ పరస్పరం తమ అభిప్రాయాలను వెలిబుచ్చినట్లు చైనా విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. అయితే ఇలాంటి 'సానుకూల పురోగతి అంశాన్ని' భారత్ తన ప్రకటనలో ప్రస్తావించలేదు. సైనిక, దౌత్య చర్చలను కొనసాగించాలని నిర్ణయించినట్లు చైనా తెలిపింది.
'ఆయుధాల్ని వేగంగా అందించండి'
తూర్పు లద్దాఖ్ సరిహద్దులో చైనాతో ప్రతిష్ఠంభన కొనసాగుతున్న తరుణంలో.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెంజమిన్ గాంట్జ్ మధ్య శుక్రవారం టెలిఫోన్ సంభాషణ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనాతో వచ్చిన సరిహద్దు సమస్యలపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్‌కు ఇజ్రాయెల్ సరఫరా చేస్తానన్న ఆయుధాలు, మందుగుండును మరింత వేగంగా అందించాలని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ కోరారు. అలాగే రక్షణ తయారీ రంగంలో ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణలు, సరళీకృత విధానాలను బెంజమిన్ గాంట్జ్‌కు తెలియజేశారు. ఇజ్రాయెల్ రక్షణ సంస్థలు, భారత కంపెనీలతో కలిసి పనిచేసేందుకు, ఆయుధాల ఉత్పత్తికి గొప్ప అవకాశాలున్నాయని చెప్పారు.
ఇదీ చూడండి:- 'భారత్-చైనా మధ్య మరొకరి జోక్యం అవసరం లేదు'