ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లో ఇకపై శునకాలు పెంచుకోవడం అంత సులభమేమి కాదు. అక్షరాలా ఐదు వేల రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోనిదే ఇంట్లో శునకాల బౌబౌలు వినిపించకూడదని తేల్చి చెప్పేసింది నగరపాలక సంస్థ. కుక్కలను పెంచుకునేందుకు లైసెన్స్ పొందడం అనివార్యం చేసింది.
సమాయానికి రేబిస్ ఇంజక్షన్లు వేయిస్తున్నారా లేదా అని పరిశీలిస్తోంది నగర పాలక సంస్థ. శునకాలు బహిరంగ మలవిసర్జన చేయకూడదనే నియమాన్నీ అమలు చేస్తోంది.
ఇదివరకే ఇలాంటి నియమం ఉన్నా అమలు నామమాత్రంగానే ఉండేది. కానీ ఇప్పుడు ఈ నియమాన్ని కఠినంగా అమలు చేస్తామంటున్నారు అధికారులు. రిజిస్ట్రేషన్ ఫీజును రూ. 50 నుంచి ఏకంగా రూ. 5000కు పెంచేశారు.
నగరంలో శునకాలు, కోతుల వల్ల వాటిల్లుతున్న దుర్గంధాన్ని దృష్టిలో పెట్టుకుని, స్వచ్ఛ గాజియబాద్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు నగర మేయర్.
స్వచ్ఛ గాజియాబాద్ కోసం కుక్కలను పెంచుకునేందుకు రూ. 5 వేలు కట్టించుకుని లైసెన్స్ జారీ చేస్తున్నాం. కుక్కలు పార్కుల్లో లేదా రోడ్లపైన మలవిసర్జన చేసినట్టు కనిపిస్తే వెంట ఉన్న యజమానికి రూ. 500 జరిమానా విధిస్తాం. పార్కుల్లో కూర్చోలేకపోతున్నామని నాకు చాలా రోజులుగా ఫిర్యాదులు అందుతున్నాయి. సాయంకాలం కుక్కలను బయటకు తీసుకువచ్చి ఆ ప్రాంతాన్ని వాటి మరుగుదొడ్లుగా తయారు చేస్తున్నారు.
- ఆశా శర్మ, గాజియబాద్ మేయర్
మనుషులతో మమేకమై కాసింత ప్రేమను పంచితే ఇంటిని కాపాలా కాచే శునకాలపై ఇన్ని నిబంధనలు ఎందుకని జంతు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. నెలకు రూ.10 వేలు జీతం వచ్చేవారు, రిజిస్ట్రేషన్ కోసం రూ. 5 వేలు ఎలా కట్టగలుగుతారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నేను ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నాను. రూ. 5000 ఖర్చు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించాల్సి వస్తే... ఇప్పుడు శునకాలను పెంచుకుంటున్నవారు కూడా రోడ్లపై వదిలేస్తారు. నిరుపేద కుటుంబంలో ఓ కుక్కను పెంచుకుంటూ, కుటుంబాన్ని పోషించుకునే వారు ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోలేరు. వారి కుక్కలను రోడ్లపై వదిలేస్తారు.
-గురుప్రీత్ కౌర్, జంతు హక్కుల ఉద్యమకారిణి
ఇదీ చూడండి:తమిళనాడులో మరో 'ఇడ్లీ బామ్మ'.. పేదలకు ఉచితం