కర్ణాటక పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఇటీవలి ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ఈ ఫలితాలు ఆ పార్టీకి ఊరటనిచ్చేవే.
56 పురపాలక సంఘాల పరిధిలోని 1221 వార్డులకు గాను కాంగ్రెస్ 509 స్థానాల్లో విజయం సాధించింది. భాజపా 366 చోట్ల నెగ్గి రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్, జేడీ(ఎస్)లు ఈ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీచేయడం గమనార్హం. జేడీ(ఎస్) 174 వార్డుల్లో గెలుపొందింది. 160 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో కలిసి పోటీచేసిన కాంగ్రెస్, జేడీ(ఎస్) చెరో సీటు మాత్రమే నెగ్గాయి.
- 7 నగర పాలికల్లోని 217 డివిజన్లకుగాను కాంగ్రెస్ 90 స్థానాలు గెల్చుకుంది. భాజపా 56, జేడీ(ఎస్) 38 వార్డుల్లో విజయం సాధించాయి.
- 30 పట్టణ పురపాలికల పరిధిలోని 714 వార్డులకుగాను 322 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. భాజపా 184, జేడీ(ఎస్) 102 వార్డుల్లో విజయంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
- 19 నగర పంచాయతీల పరిధిలో 290 వార్డులకు జరిగిన ఎన్నికల్లో భాజపా అధిక సీట్లు సాధించింది. అత్యధికంగా 126 స్థానాల్లో గెలిచింది కాషాయ పార్టీ. కాంగ్రెస్, జేడీ(ఎస్) వరుసగా 97, 34 సీట్లు సాధించి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
సార్వత్రిక పోరులో బోల్తా...
కర్ణాటక వ్యాప్తంగా మే 29న ఈ ఎన్నికలు నిర్వహించారు. జాతీయ స్థాయి ఎన్నికల్లో స్థానిక నాయకత్వం మధ్య సమన్వయ లోపంతో ఇక్కడ సంకీర్ణ కూటమి విఫలమైంది. 28 లోక్సభ స్థానాల్లో భాజపా 25 గెల్చుకుంది. కాంగ్రెస్, జేడీ(ఎస్) ఒక్కో సీటును నెగ్గాయి.
ఈ ఎన్నికల ఫలితాలు ఓటర్ల నాడికి నిదర్శనమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. పట్టున్న చోట్ల భాజపా గెలిచిందని తెలిపారు ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప. రాష్ట్రంలో స్థానిక స్థాయిలో పార్టీ బలంగా ఉందని నిరూపితమైనట్లు పేర్కొన్నారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండురావు.
గతేడాది 105 పురపాలక సంఘాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 982 వార్డుల్లో గెలిచింది. భాజపా, జేడీ(ఎస్) 929, 375 స్థానాలతో నిలిచాయి.