రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. రఫేల్ ఒప్పందంపై డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్లు వేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, పిటిషనర్లు అత్యున్నత న్యాయస్థానంలో ప్రమాణపత్రాలు దాఖలు చేశారు.
రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో సుప్రీంకోర్టుకు కేంద్రం అసత్య సమాచారాన్ని సమర్పించిందని పిటిషనర్లు ప్రమాణపత్రంలో ఆరోపించారు. దీనిపై కేంద్రం స్పందించింది. పిటిషనర్లే కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రమాణపత్రం దాఖలు చేసింది. మీడియా కథనాలు, అసంపూర్ణ సమాచారాల ఆధారంగా వ్యాజ్యాలు వేశారని విమర్శించింది.
ఇదీ చూడండి : 'కేంద్రం తప్పుదోవ పట్టించింది..' 'కాదు పిటిషనర్లే!'
రాహుల్ 'ధిక్కరణ'పై విచారణ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను నేడు విచారించనుంది సుప్రీంకోర్టు. 'చౌకీదార్ చోర్' వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు తప్పుగా ఆపాదించినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సర్వోన్నత న్యాయస్థానానికి ఇప్పటికే బేషరతు క్షమాపణలు చెప్పారు. తాను ఈ వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా చేయలేదని పేర్కొంటూ ప్రమాణపత్రాలు దాఖలు చేశారు.
కాపలాదారే దొంగ అని రఫేల్ తీర్పులో సుప్రీంకోర్టే చెప్పిందని గతంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాజపా నేత మీనాక్షి లేఖి అత్యున్నత న్యాయస్థానంలో రాహుల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. కోర్టు సైతం వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించారని అభిప్రాయపడుతూ రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చూడండి : సుప్రీంకు రాహుల్ బేషరతు క్షమాపణలు
అయోధ్య కేసుపై ...
అయోధ్య రామజన్మ భూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసుపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. వివాద పరిష్కారానికి మధ్యవర్తుల ప్యానెల్ ఏర్పాటు తర్వాత తొలిసారి కేసును విచారించనుంది అత్యున్నత న్యాయస్థానం. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసులో వాదనలను విననుంది.
అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం పరిష్కారం కోసం మార్చి 8న మధ్యవర్తుల ప్యానెల్‌ను నియమించింది సుప్రీంకోర్టు. సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎం ఖలీఫుల్లా నేతృత్వం వహిస్తున్న ఈ ప్యానెల్లో ఆధ్మాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచూ సభ్యులుగా ఉన్నారు.
ఇదీ చూడండి : అయోధ్యపై మధ్యవర్తిత్వం ప్రారంభం