ప్రతిరోజు కళాశాలకు వెళ్లకుండానే డిగ్రీ సర్టిఫికేట్ పొందేందుకు మార్గం సుగమం చేసింది ఐఐటీ మద్రాస్. ప్రపంచంలో తొలిసారి ఆన్లైన్ డిగ్రీ, డిప్లమో కోర్సులను ప్రవేశపెట్టింది. ప్రోగ్రామింగ్, డేటా సైన్సెస్‌లో ఈ అవకాశాలు కల్పిస్తోంది. అయితే ఈ కోర్సుకు ఎవరు అర్హులు? ఎలా ఎంపిక చేస్తారు? వంటి వివరాలు చూద్దాం.
ఎలా అప్లై చేసుకోవాలి..?
డిప్లమోలో చేరాలనుకుంటే విద్యార్థి 10వ తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులను కచ్చితంగా చదవాలి. వాటితో పాటు ఇంటర్ పూర్తి చేయాలి. డిగ్రీలో చేరేందుకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లు, డిగ్రీ చదివిన వాళ్లు, మధ్యలోనే డిగ్రీ ఆపేసిన వాళ్లు అర్హులు. దీనికి ఓ అర్హత పరీక్ష ఉంటుంది. దరఖాస్తు రుసుం 3వేల రూపాయలు. ఇందులో 50 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది.
ఆన్లైన్ కోర్సులో..
ఈ ఆన్లైన్ కోర్సు ప్రోగ్రామ్‌లో మూడు లెవెల్స్ ఉంటాయి. ఫౌండేషన్ లెవల్, డిప్లమో, డిగ్రీ. ఇందులో ఎప్పుడైనా విద్యార్థి నిష్క్రమించొచ్చు. లేదంటే మూడింటినీ పూర్తి చేయొచ్చు. ఇందులో మొత్తం 31 కోర్సులు ఉంటాయి. వాటిని మూడు నుంచి ఆరేళ్లలో పూర్తి చేయొచ్చు. ఆన్లైన్ కోర్సులు, ఎసైన్మెంట్లు, క్విజ్లు, పరీక్షలు వర్చువల్‌గా జరుగుతాయి. వాటికి 116 క్రెడిట్లు ఇస్తారు.
కోర్సులను ఎంపికచేసుకున్న విద్యార్థులకు రెండు ఎంట్రీ ఆప్షన్లు ఉంటాయి.
1. రెగ్యులర్:
12వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ రెగ్యులర్ ఎంట్రీ ద్వారా ఫౌండేషన్ లెవల్ కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యుటేషనల్ థింకింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులు ఉంటాయి. దీనిలోనే డిప్లమో, డిగ్రీ లెవల్ కోర్సులు చేయొచ్చు.
2. డిప్లమో:
ఈ ఎంట్రీ ద్వారా కోర్సు నేర్చుకునేందుకు ప్రొఫెషనల్ వర్కర్లకు అవకాశమిచ్చారు. డిప్లమో ఇన్ ప్రోగ్రామింగ్, డిప్లమో ఇన్ డేటాసైన్స్ చేరొచ్చు. ఈ కోర్సులను మద్రాస్ ఐఐటీ అందిస్తోంది. వీరికి డిగ్రీ లెవల్ కోర్సులు చదివేందుకు అవకాశం ఉండదు.
ఫీజులు...
ఈ కోర్సు మొత్తం ఫీజు రూ.2,42,000
- ఫౌండేషన్ లెవల్: రూ.32,000 (8 కోర్సులకు)
- డిప్లమో లెవల్: రూ.1,12,000 (12 కోర్సులకు)
- డిగ్రీ లెవల్: రూ.1,00,000 (11 కోర్సులకు)
డేటా సైన్స్‌లో విపరీతంగా అవకాశాలు పెరుగుతున్నాయి. 2026 నాటికి 11.5 మిలియన్ జాబ్‌లు ఈ కోర్సు ద్వారా వస్తాయని అంచనా. అందుకే ఈ కోర్సును ప్రత్యేకంగా అందిస్తోంది ఐఐటీ మద్రాస్. త్వరలో ఆన్లైన్ ఆప్లికేషన్ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు, అప్లికేషన్ దరఖాస్తు తేదీల కోసం "onlinedegree.iitm.ac.in" వెబ్సైట్ చూడండి.