ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ), మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ సాయంతో ఇంజినీరింగ్ సమస్యలను పరిష్కరించడానికి సరికొత్త అల్గారిథమ్‌లను అభివృద్ధి చేశారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)- మద్రాస్ పరిశోధకులు. తమ కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ 'ఏఐసాఫ్ట్' కోసం ఓ అంకుర పరిశ్రమను ప్రారంభించి.. థర్మల్ మేనేజ్మెంట్, సెమీకండక్టర్, ఆటోమొబైల్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ కూలింగ్ అప్లికేషన్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించనున్నారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్‌లను దశాబ్ద కాలంగా వినియోగిస్తున్నా.. అవి కేవలం సిగ్నల్ ప్రాసెసింగ్, స్పీచ్ రికగ్నైజేషన్, ఇమేజ్ రీకన్స్ట్రక్షన్, ప్రెడిక్షన్కే పరిమతమయ్యాయి. సమస్య పరిష్కారానికి ఈ తరహా అల్గారిథమ్‌లను ఉపయోగించేందుకు చాలా తక్కువ ప్రయత్నాలు జరిగాయి.
ఐఐటీ మద్రాసులో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరిశోధకుడు డా. విశాల్ నందిగానా నేతృత్వంలోని పరిశోధకుల బృందం... కృత్రిమ మేధ, డీప్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను సృష్టించింది. మనుషులకు అంతుచిక్కని సమస్యలకూ ఇవి పరిష్కారాన్ని అందిస్తాయి.
ఇదొక సరికొత్త ఆలోచన. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు పరిశోధక బృందాల దృష్టి దీనిపై పడింది. సమస్యల పరిష్కారానికి ఈ పరిశోధక బృందాలు.. కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్(సీఎన్ఎన్), సీ-జీఏఎన్(కండీషనల్ జెనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్)లను వినియోగిస్తున్నాయి.
"థర్మల్ మేనేజ్మెంట్ సమస్యలను పరిష్కరించడానికి.. ఏఐసాఫ్ట్ను మేము పరీక్షించాం. క్షేత్రస్థాయిలో.. ప్రస్తుతం వినియోగిస్తున్న వాటికన్నా ఈ సాఫ్ట్వేర్ ఎన్నో రెట్లు ఉత్తమం. దీనితో ఎంతో సమయం ఆదా అవుతుంది. ఎన్నో ఇంజినీరింగ్ సమస్యలను పరిష్కరించడానికి ఇది ముఖ్యం."
--- డా. విశాల్ నందిగానా, పరిశోధకుడు.
డేటాను వినియోగించే కృత్రిమ మేథ, డీప్ లర్నింగ్ మోడెళ్లను ఉపయోగించి సమస్యను పరిష్కరిస్తారు. డేటా సెట్లతో ఆ ఏఐ శిక్షణ ఇచ్చిన తర్వతే ఇది సాధ్యపడుతుంది. సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో జరిగిన ఎన్నో పరిశోధనల నుంచి ఈ డేటాను సేకరించారు. ఏఐకి శిక్షణ అందించేందుకు ఒకవేళ డేటా లేకపోతే.. సీఎఫ్‌డీ(కంప్యుటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్)తో దీనిని సృష్టించవచ్చు.
"సరికొత్త పునరావృత న్యూరల్ నెట్వర్క్(ఆర్ఎన్ఎన్), డీప్ న్యూరల్ నెట్వర్క్(డీఎన్ఎన్)ను సమస్య పరిష్కారానికి వినియోగిస్తున్నాం.''
- డా. విశాల్ నందిగానా, పరిశోధకుడు.
థర్మల్, ఎలక్ట్రానిక్ శీతలీకరణ పరిశ్రమల్లో ఏర్పడే థర్మల్ మేనేజ్మెంట్ సమస్యలను పరిష్కరించడానికి... జీపీయూ, మల్టీ-థ్రెడింగ్ సహాయంతో ఐఐటీ మద్రాస్ పరిశోధకులు ఓ హార్డ్‌వేర్ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఎన్నో న్యూమరికల్ పద్ధతుల కన్నా వీరు తయారు చేసిన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లు ఎంతో వేగంగా పనిచేస్తాయి. ఎన్నో ప్రధాన సమస్యలను పరిష్కరించడం సహా విద్యాపరంగానూ ఈ అల్గారిథమ్‌లు ఉపయోగపడతాయి.